పెద్దదోర్నాల: ఎదురెదురుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్సు, తుఫాన్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక వాసులకు గాయాలు కావటంతో పాటు, ఘాట్ రోడ్డులో రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కర్ణాటక నుంచి శ్రీశైలానికి వెళ్తున్న తుఫాన్ వాహనాన్ని, శ్రీశైలం నుంచి వస్తున్న కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తుమ్మలబైలు సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తుఫాన్‌లో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా పసురుకు చెందిన అశోక్, రాఘవేంద్ర, సోమేష్ చౌహాన్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పెద్దదోర్నాల, పెద్దారవీడు 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు వైద్యశాలకు తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డుకిరువైపులా వాహనాల రాకపోకలు 2 గంటల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు, కొందరు ఆర్టీసీ సిబ్బంది కలిసి రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కంభం: కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డులో బుధవారం పట్టపగలే చోరీ జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. ఉదయం 10 గంటల సమయంలో జరిగిన చోరీ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సై శివకృష్ణారెడ్డి కథనం మేరకు.. పందీటి రాజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విధులకు హాజరు కాగా, ఆయ భార్య ఇంటికి తాళం వేసి పనుల రీత్యా గిద్దలూరు వెళ్లారు. ఆమె ఇంటికి వచ్చేసరికి తాళం తెరిచి ఉంది. బీరువా పగలగొట్టి ఉండటంతో పోలీసుకు సమాచారం ఇచ్చారు. 5 గ్రాముల బరువైన రెండు జతల బంగారు కమ్మలు, 10 తులాల బరువైన రెండు జతల వెండి గొలుసులు, రూ.20 వేల నగదు చోరీ అయినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న తుఫాన్ వాహనం.. ముగ్గురికి గాయాలు
ట్రాఫిక్‌కు 2 గంటల పాటు తీవ్ర అంతరాయం


