కందుకూరు రూరల్: కందుకూరు మండలంలోని శ్రీరంగరాజపురం సమీపంలో మన్నేరు నుంచి ఇసుక తవ్వి మదనగోపాలపురం సమీపంలో డంప్ చేస్తున్నారు. శ్రీరంగరాజపురానికి చెందిన రైతు ఒంగోలుకు చెందిన ఇసుక వ్యాపారికి పేదల భూమిని తన భూమి అంటూ ఇసుకను విక్రయించాడు. దీంతో ఒంగోలుకు చెందిన వ్యాపారులు ఇసుక తవ్వకాలు జరిపి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి రైతులకు, కూటమి నాయకులకు ఎక్కువ మొత్తంలో ముడుపులు చెల్లించి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. మన్నేరు నుంచి లారీలు, టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు ఇసుక తరలి వెళ్తున్నా ఏ అధికారీ పట్టించుకోవడం లేదు. మన్నేరులో పెద్ద పెద్ద క్వారీలు పెట్టి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, దీని వల్ల మంచినీటి బోర్లకు, వ్యవసాయ బోర్ల నీటికి ఇబ్బంది కలుగుతుందని శ్రీరంగరాజపురం, మదనగోపాలపురం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఎస్సీల భూముల్లో ఇసుక తవ్వకాలు:
ఉలవపాడు మండలంలోని బద్దిపూడి గ్రామం ఎస్సీలకు సంబంధించిన ఇసుక భూముల్లో జేసీబీతో తవ్వకాలు జరిపి మదనగోపాలపురం గ్రామం వద్ద డంపింగ్ చేసి అక్కడ నుంచి లారీల్లో తరలిస్తున్నారు. మా భూముల్లో తవ్వకాలు జరపవద్దని ఎన్ని సార్లు అడ్డుకున్నా అధికార బలం, అధికారుల అండదండలతో ఒంగోలుకు చెందిన ఇసుక వ్యాపారులు ఇసుక తవ్వుకొని వెళ్తున్నారని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికారులు వారికే వంత పలుకుతున్నారని, అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు.
భారీగా తరలి వెళ్తున్న ఇసుక


