బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026 – 8లో.. ఇన్‌చార్జిల కనుసన్నల్లోనే రేషన్‌ మాఫియా... కనిగిరిలో ఒంగోలు నేత దందా..

న్యూస్‌రీల్‌

జిల్లాలో తమ్ముళ్ల చేతుల్లోకి రేషన్‌ డీలర్‌ షిప్‌ జిల్లా మంత్రుల ఇలాఖాలో రెచ్చిపోతున్న మాఫియా అద్దంకి, కొండపిల్లో అక్రమ రవాణాకు అడ్డేలేదు ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలకు నెలనెలా మామూళ్లు పశ్చిమంలో కీలక నేత సోదరుడికి కప్పం కనిగిరిలో చక్రం తిప్పుతున్న ఒంగోలు శ్రీనివాసుడు దర్శి, యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్‌చార్జిల కనుసన్నల్లో బియ్యం తరలింపు ఒంగోలులో పీఏలు చెప్పిందే రేటు నేరుగా చైన్నె, కృష్ణపట్నం పోర్టులకు తరలుతున్న బియ్యం చేతులెత్తేసి చోద్యం చూస్తున్న అధికారులు

గ్రోత్‌ సెంటర్‌

రైస్‌ మిల్లు అడ్డాగా ...

యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గంలో ఇన్‌చార్జిల కనుసన్నల్లోనే బియ్యం మాఫియా వ్యవహారం నడుస్తోంది. యర్రగొండపాలెం నియోజకవర్గంలో రేషన్‌ డీలర్లు కొందరు నేరుగా లబ్ధిదారుల ఇంటికి థంబ్‌ తీసుకొని నగదు ఇచ్చి వస్తున్నారు. కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేస్తున్నారని, బియ్యం అడిగితే స్టాకు అయిపోయిందని, లేకపోతే సర్వర్‌ డౌన్‌ అయిందని చెప్పి బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న వైపాలెం టీడీపీ ఇన్‌చార్జి డీలర్లను ఉద్దేశించి ‘‘నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు దెం...తున్నారని’’ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఇక దర్శి నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం సేకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరైతే ఎక్కువ బియ్యాన్ని సేకరిస్తారో వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో రేషన్‌ బియ్యం అధికార పార్టీ కీలక నేతలకు ఏటీఎంగా మారింది. పేదలకు అందాల్సిన చౌక బియ్యాన్ని పందికొక్కుల్లా పచ్చ పార్టీ నేతలు అడ్డగోలుగా బొక్కేస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగతాది దర్జాగా నల్లబజారుకు తరలించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఇద్దరు మంత్రుల ఇలాఖాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని లోకం కోడై కూస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఉమ్మడి జిల్లా అంతటా మూడు వ్యాన్లు.. ఆరు లారీల్లా అక్రమ రవాణా సాగిపోతోంది. జిల్లా నలుమూలల నుంచి టన్నుల కొద్దీ బియ్యం జోరుగా విదేశాలకు ఎగుమతవుతోంది.

కనిగిరిలో స్థానిక నాయకులను కాదని ఒంగోలు నుంచి దిగుమతి చేసుకున్న నాయకుడికి రేషన్‌ సేకరణ అప్పగించినట్లు స్థానిక టీడీపీ నాయకులు కొందరు గొణుక్కుంటున్నారు. ఒంగోలుకు చెందిన రేషన్‌ మాఫియా డాన్‌ ఒకరు కనిగిరిలో తన వ్యక్తుల ద్వారా బియ్యం సేకరించి పట్టణ శివారులో నిల్వ చేస్తున్నట్లు సమాచారం. రెండు మినీ వ్యాన్ల ద్వారా రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా ఒంగోలుకు బియ్యం తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నాయకుడి అండదండలుండడంతో అధికారులు ఎవరూ ఇటు వైపు కన్నెత్తి చూసేందుకు సాహసం చేయడం లేదు.

చౌకగా.. దోచేయగా

ప్రతి మండలానికి పాట...

పశ్చిమ ప్రకాశంలో ముఖ్యమైన నియోజకవర్గంలో కీలక నేత సోదరుడే రేషన్‌ మాఫియాను శాసిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రేషన్‌ బియ్యం కొనుగోలుకు వేలం పాట నిర్వహించి, ఎవరైతే ఎక్కువ పాడుకున్నారో వారికి రేషన్‌ బియ్యం సేకరణ అప్పగించినట్లు తెలుస్తోంది. పాట ప్రకారం ప్రతి నెలా కీలక నేత సోదరుడికి ముట్టచెప్పాలి. ఇక్కడ సేకరించిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో సేకరించిన బియ్యాన్ని పల్నాడు జిల్లా వినుకొండలో ఉన్న టీడీపీ నాయకుడికి విక్రయిస్తుంటారని, అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు బియ్యం తరలిపోతుందని చెవులు కొరుక్కుంటున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా కీలక నేత సోదరుడి పెత్తనం కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి బియ్యం సేకరిస్తున్నట్లు సమాచారం. రేషన్‌ దుకాణాల నుంచి కూడా రేషన్‌ బియ్యం సేకరించి బేస్తవారిపేట జంక్షన్లోని ఒక రైస్‌ మిల్లుకు తరలించి అక్కడ నుంచి పోర్టులకు తరలిస్తున్నట్లు సమాచారం. బియ్యం సేకరణకు గాను మండలానికి ఒకరు చొప్పున టీడీపీ నాయకులను నియమించి వారికి నెలకు రూ.20 నుంచి రూ.50 వేల వేతనం కూడా ఇస్తున్నట్లు సమాచారం. దీంతో పోటాపోటీగా బియ్యం సేకరణ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌:

జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీ ఒక తంతుగా మారింది. ప్రతి నెలా 12వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అది కూడా అరకొరగానే బియ్యం పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా రేషన్‌ కార్డు ప్రకారం బియ్యం ఇవ్వమని అడిగితే డీలర్లు వారితో వాదనకు దిగుతున్నారు. ‘‘ఇంతే ఇస్తాం...నీకు ఇష్టమొచ్చిన వారికి చెప్పుకో..మాకేం కాదంటూ’’ నిర్లక్ష్యంగా జవాబిస్తున్నారు. బియ్యం పంపిణీ గురించి తనిఖీ చేయాల్సిన రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ సిబ్బంది కాగడా పెట్టి వెదికినా కనిపించడం లేదు. ఎక్కడో ఒక చోట నామ మాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రతి నెలా 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తోంది. ఇందులోంచి 50 శాతానికి పైగా బియ్యాన్ని తరలించాలని అధికార పార్టీ నాయకులు డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు సుమారుగా 6 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యం తరలిపోతుందని తెలుస్తోంది.

మంత్రుల నియోజకవర్గాల్లో అడ్డూ అదుపు లేకుండా...

జిల్లాలో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో మంత్రికి సన్నిహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల సారథ్యంలో బియ్యం సేకరణ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం సేకరణ కోసం నియోజకవర్గ బాధ్యతలను ఒకరికి అప్పగించినట్లు సమాచారం. సేకరించిన బియ్యాన్ని అద్దంకి నుంచి నేరుగా హైవే ఎక్కి చైన్నెలోని ఒక రైస్‌ మిల్లుకు తరలిస్తున్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి గారి కొండపి నియోజకవర్గంలో కూడా యథేచ్ఛగా రేషన్‌ బియ్యం అక్రమ మార్గాన తరలిపోతోంది. ఈ నియోజకవర్గంలో రేషన్‌ డీలర్లు ఇద్దరు కీలక నాయకులతో వేగలేకపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రికి సన్నిహితంగా మెలుగుతున్న ఒక కీలక నాయకుడి పెత్తనం కొండపి నియోజకవర్గంలో ఎక్కువగా ఉందని వినిపిస్తోంది. సింగరాయకొండలోని ఓ రైస్‌మిల్‌ కేంద్రంగా రేషన్‌ మాఫియా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలోని సింగరాయకొండ, మర్రిపూడి, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు, టంగుటూరు మండలాల నుంచి బియ్యాన్ని సేకరించి నేరుగా చైన్నె పోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎవరైనా డీలర్‌ మాట వినకపోతే అతడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు జరుగుతున్నాయని సమాచారం.

రెండు మూడు రోజులే బియ్యం పంపిణీ...

ఒంగోలు నగరంలో రేషన్‌ బియ్యం పంపిణీ సక్రమంగా జరగడంలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి నెలలో కేవలం రెండు మూడు రోజులకు మించి బియ్యం సరఫరా చేయడంలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో 5వ తేదీ సాయంత్రమే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రేషన్‌ డీలర్‌ అక్రమంగా బియ్యం తరలిస్తుండగా స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అయినా అధికారులు మాత్రం కళ్లు మూసుకొని తమకేమీ తెలియదన్నట్లుగా మిన్నకుండిపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ కీలక నేత పీఏల కనుసన్నల్లో రేషన్‌ అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ కీలక నేత సహాయంతో ఒంగోలుకు చెందిన కొందరు టీడీపీ నాయకులు చీరాల, కనిగిరిల్లో పాగా వేసి రేషన్‌ బియ్యం సేకరించి అడ్డదారిలో అమ్ముకుంటున్నట్లు సమాచారం.

సంతనూతలపాడు నియోజకవర్గంలో అధికార పార్టీ కీలక నేత ప్రధాన అనుచరులే రేషన్‌ బియ్యం మాఫియాను నడిపిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులప్పలపాడు, మద్దిపాడు మండలాల్లో టీడీపీ కార్యకర్తలను నియమించుకొని వారి ద్వారా రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సేకరించిన బియ్యాన్ని మద్దిపాడు మండలం గ్రోత్‌ సెంటర్లోని ఒక రైస్‌ మిల్లుకు తరలిస్తున్నారని తెలుస్తోంది. కీలక నేతతో దొడ్డిదారి ఒప్పందం చేసుకున్న పల్నాడు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడైన రేషన్‌మాఫియా డాన్‌ ద్వారా కృష్ణపట్నం పోర్టుకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. కందుకూరు నియోజకవర్గంలో రేషన్‌ బియ్యం పంపిణీ జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు కిలోకు రూ.10 లెక్కన చేతిలో పెట్టి బియ్యం లేదని ఒట్టి చేతులు చూపుతున్నారని వాపోతున్నారు. పచ్చ తమ్ముళ్లు సిండికేట్‌గా తయారై కృష్ణపట్నం పోర్టుకు బియ్యం తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కీలక నేతకు నైవేద్యం ముట్టచెబుతున్నామని చెబుతుండడంతో అధికారులు మనకెందుకు వచ్చిన గొడవంటూ పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement