పొగాకు రైతుల ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం కందుకూరు వేలం కేంద్రం సంఘటనలో బహిర్గతమైన టీడీపీ కుట్ర రేట్లు లేక రైతులు నానా అవస్థలు పడుతుంటే అధికార పార్టీ తీరుపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం
కందుకూరు: ‘‘అమ్మా పెట్టదు.. అడుక్కు తిననీయదు’’ అన్న చందంగా ఉంది అధికార పార్టీ నేతల వ్యవహార శైలి. గిట్టుబాటు ధరలు లేక కడుపు మండి పొగాకు రైతులు రోడ్డెక్కుతుంటే అండగా నిలవాల్సిన అధికార పార్టీ.. రైతుల ఆందోళనలను నీరుగార్చే కుట్రలకు పాల్పడుతోంది. దీంతో అధికార పార్టీ నేతల తీరుపై పొగాకు రైతుల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో సోమవారం జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది పొగాకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు అయినా చేతికొస్తే చాలు అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. అయితే రెండు నెలలుగా వేలం జరుగుతున్న తీరును పరిశీలిస్తే పొగాకు రైతుల ఆందోళనను మరింత పెంచేలా ఉంది. గిట్టుబాటు ధరలు అటుంచి కనీసం వేలం కేంద్రాలకు తెచ్చిన పొగాకును కూడా కొనే దిక్కు లేకుండా పోయింది. అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు పొగాకు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన బేళ్లు అధిక శాతం నోబిడ్ కింద నమోదవుతున్నాయి. ఒకవేళ కొన్నా కూడా అతి తక్కువ ధరలకు అదీ కొద్ది మొత్తంలోనే బేళ్లు కొంటున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ ఆవేదనను, ప్రస్తుత మార్కెట్ పరిస్థితిని ప్రభుత్వం, పొగాకు బోర్డు దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ఆందోళన బాట పడుతున్నారు. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలుంటే అన్ని వేలం కేంద్రాల్లోను రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనలకు దిగుతున్నారు. ప్రతి రోజు వేలాన్ని అడ్డుకోవడంతో పాటు, రోడ్లపై బేళ్లను వేసి తగలబెడుతున్నారు. వీరికి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పాటు, పలు రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు వంటి మద్దతు తెలుపుతున్నాయి. పొగాకు రైతులను ఆదుకోవాలంటూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క అధికార పార్టీ మాత్రం పొగాకు రైతుల ఆందోళనలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. వారి ఆందోళనలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడంతో పాటు, గిట్టుబాటు ధరలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అన్న రీతిలో ఆ పార్టీ నేతల వ్యవహార శైలి ఉంది.
టీడీపీ నేత ఓవరాక్షన్‌పై రైతుల విస్మయం:
పొగాకు రైతులకు మద్దతుగా కందుకూరులోని రెండో వేలం కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ రైతుల తరుఫున బోర్డు అధికారులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడి ముసుగులో టీడీపీ నాయకుడు బుర్రాను అడ్డుకునే ప్రయత్నం చేయడం అక్కడ వారికి వింతగా అనిపించింది. గిట్టుబాటు ధరలు రాకపోతే బోర్డుకేం సంబంధం అంటూ వితండ వాదం చేసే ప్రయత్నం చేశారు. బోర్డును బ్లెయిమ్ చేయవద్దు, అంతర్జాతీయ మార్కెట్ బాగా లేదంటూ వ్యాపారులకు వత్తాసు పలికేందుకు రైతుల ఆందోళనను తప్పుదారి పట్టించేందుకు పథకం వేశారు. అయితే అక్కడ ఉన్న రైతులు ఒక్కసారి రివర్స్ అయ్యారు. బోర్డులో రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతే ఇంక ఎక్కడ ఇస్తారని, అయినా మేము మా ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా చేస్తుంటే నీకేం పని అంటూ నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా జిల్లాలో జరుగుతున్న పొగాకు రైతుల ఆందోళనలకు మద్దతు తెలపకపోగా ధరల విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించే కుట్రలకు పాల్పడడంపై తీవ్ర విమర్శలు ఆ పార్టీ నేతలు మూటగట్టుకుంటున్నారు. అసలే చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో పొగాకు రైతుల జీవితాలు తారుమారయ్యాయని, గత రెండేళ్లలో అప్పులు తప్ప పైసా మిగిలింది లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో అండగా నిలవాల్సిన ప్రభుత్వం తరఫున నాయకులే ఇటువంటి చేష్టలకు దిగుతుండడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన నిలబడటమే నేరంగా చూపిస్తూ పచ్చ మీడియాలో వైఎస్సార్ సీపీ నాయకులపై దుష్ప్రచారానికి ఒడిగట్టారు.


