మండుటెండలోనూ ‘బడి పిలుస్తోంది’ ర్యాలీలు పిల్లలను బడుల్లో చేర్చాలని ఉపాధ్యాయులకు టార్గెట్లు విద్యార్థులు లేకపోతే పోస్టులు రద్దవుతాయని అధికారుల హెచ్చరికలు
అద్దంకి: ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినా ఉపాధ్యాయులకు మాత్రం ప్రతి రోజూ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని విద్యాశాఖ హెచ్చరించింది. ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ రూపొందించిన కార్యక్రమాల్లో డీవైఈఓలు, ఎంఈవోలు, ఉపాధ్యాయులు మండలాల్లో తిరగాల్సి ఉంది. గత నెల 24 నుంచి అన్ని పాఠశాలలకూ వేసవి సెలవులు ప్రకటించినా, ఉపాధ్యాయులు మాత్రం వారి పాఠశాల పరిధిలోని బడిఈడు పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించే బాధ్యత నిర్వర్తించాలని విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేయడంతో వేసవి సెలవుల్లో సైతం తాము పనిచేయక తప్పడంలేదని పలువురు వాపోతున్నారు. మండు వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు సూచిస్తున్న ప్రభుత్వం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. తమకు మాత్రం వేళాపాళా లేకుండా ‘బడి పిలుస్తోంది’ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించడం ఏమిటని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
పిల్లల్ని చేర్పించాల్సిందే..
ప్రతి ఉపాధ్యాయుడు తమ తరగతిలో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని, టీచర్– విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఈ సంఖ్య లేకపోతే ఆ ఉపాధ్యాయుడిని వేరొక స్కూలుకు పంపుతామని ఇప్పటి నుంచే విద్యాశాఖాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో ఆ పాఠశాలలను సమీప స్కూళ్లలో విలీనం చేస్తారని, పోస్టులు సైతం రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు, పదవీ విరమణ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులను సైతం ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తుండడంతో మండుటెండలో తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.


