మట్టి తవ్వకాలతో వరిసాగు ప్రశ్నార్థకం | - | Sakshi
Sakshi News home page

మట్టి తవ్వకాలతో వరిసాగు ప్రశ్నార్థకం

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

కొత్తపట్నం:

‘చెరువులో ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తే 2 వేల ఎకరాల భూమి బీడుగా మారుతుంది. చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేద’ని వైఎస్సార్‌ సీపీ ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు ప్రశ్నించారు. మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన చాపాయి, చక్రాయి ఇరిగేషన్‌ చెరువులో మట్టిని ఇష్టం వచ్చినట్లు తవ్వి వెంచర్లకు తరలిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు సోమవారం కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. దీంతో కాసేపు తవ్వకాలు ఆపేసి..తిరిగి మంగళవారం యధావిధిగా తవ్వకాలు ప్రారంభించారు. దీంతో మంగళవారం వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జనసేన నాయుడు మిట్నసల చైతన్య ప్రసాద్‌, సీపీఎం మండల కార్యదర్శి సూరిని స్వామిరెడ్డి, గ్రామస్తుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ చెరువులో ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వుతున్నా పంచాయతీ కార్యదర్శి నాకేం తెలియదన్నట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇరిగేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. ముదిగొండ వద్ద దగ్గర మట్టి తీస్తుంటే ఉప్పునీరుగా మారాయని గుర్తు చేశారు. ఇవన్నీ చౌడు భూములని, తవ్వేకొద్ది ఉప్పునీరు ఊరి పంటలు దెబ్బతింటాయని, పొలాలు కూడా పనికి రాకుండా పోతాయని చెప్పారు. ఇరిగేషన్‌ చెరువుల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకూడదని, కానీ ఇక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ ఈ ఇరిగేషన్‌ చెరువు పరిధిలో 1800 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లకు పంచాయతీ అనుమతితో మట్టి తోలుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే వేల మంది రైతులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతు విభాగం జనరల్‌ సెక్రటరీ ఆళ్ల రవీంద్రరెడ్డి మాట్లాడుతూ చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అక్రమంగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైతు కూలీ సంఘం మండల కార్యదర్శి స్వామిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సహాయంతోనే ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్వి తరలిస్తున్నారన్నారు. అక్రమ తవ్వకాలు ఆపకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, స్వర్ణ శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, వెంకారెడ్డి, శీనారెడ్డి, హరిబాబు, నాంచార్లు, మల్లికార్జున, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏంటి..?

ఇరిగేషన్‌ అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు

తవ్వకాలు ఆపకుంటే వాహనాలను అడ్డుకుంటాం

చాపాయి, చక్రాయి చెరువు వద్ద నేతల సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement