కూలి పనికి వచ్చి ఇంటికి కన్నం | - | Sakshi
Sakshi News home page

కూలి పనికి వచ్చి ఇంటికి కన్నం

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

కంభం: కూలి పని కోసం వచ్చి పక్కింటికి కన్నం వేసి నగలు, నగదు కాజేసి వెళ్లారని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన అర్థవీడు మండలం గన్నేపల్లిలో జరిగిన చోరీలో నేరస్తులను పోలీసులు అదుపులోనికి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. పెద్దారవీడు మండలానికి చెందిన దూదేకుల ఖాసీం, మార్కాపురానికి చెందిన ఈర్ల అంకమరాజు, తాడివారిపల్లికి చెందిన కందుల షడ్రక్‌ అను ముగ్గురు గన్నేపల్లిలో యర్రయ్య అనే మేసీ్త్ర దగ్గర బేల్దారీ పనులకు వచ్చి గ్రామంలో పని చేసుకుంటున్నారు. వీరిలో గతంలో నేర చరిత్ర కలిగిన దూదేకుల చిన్నఖాసీం వలి మిగిలిన ఇద్దరిని కలుపుకొని గ్రామానికి చెందిన కనుమర్లపూడి వెంకట సురేష్‌ కుటుంబంతో కలసి శ్రీశైలంలో బంధువుల శుభకార్యానికి వెళ్లిన విషయం తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇంట్లో చోరీ చేయాలని నిర్ణయించుకొని 11వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల సమయం ఇంట్లోకి ప్రవేశించి తలుపులు పగల గొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారు బిస్కెట్‌, 3 బంగారు ఉంగరాలు, ఒక జత బంగారు జాలర్లు, ఒక జత బంగారు చెవిచుట్టలు, నాలుగు జతల చెవికమ్మలు, రూ.50 వేల నగదు అపహరించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో కంభం సీఐ కె. మల్లికార్జున, అర్థవీడు ఎస్సై శివనాంచారయ్య సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం అర్థవీడు మండలంలోని నాగులవరం గ్రామంలో ఆంజనేయస్వామి గుడి వద్ద నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గన్నేపల్లిలో జరిగిన చోరీలో బంగారాన్ని రికవరీ చేశారు. వీటితో పాటు దూదేకుల ఖాసిం గతంలో ఏప్రిల్‌ 29న పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో మట్టి వెంకట్లక్ష్మమ్మ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులో సుమారు రూ. 15 లక్షలు విలు విలువైన బంగారు, వెండి వస్తువులు, ఈనెల 2వ తేదీన లక్ష్మి చెన్నకేశవనగర్‌ కాలనీలో మార్కాపురంలో చిలకపాటి రాజాబాబు ఇంట్లో బీరువా పగలగొట్టి రూ. 40వేలు విలువ చేసే వస్తువులు దొంగిలించినట్లు తెలిపారు. వీటితో పాటు పెద్దారవీడు పోలీస్‌ స్టేషన్‌లో రెండు ట్రాన్స్‌ఫార్మర్ల వైర్ల దొంగతనం కేసులు, అర్థవీడు పోలీస్‌స్టేషన్లో వైరు దొంగతనం, మార్కాపురం రూరల్‌ స్టేషన్‌లో 3 ట్రాన్స్‌ఫార్మర్లలోని వైర్ల దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా పనిచేసిన సీఐ కె. మల్లికార్జున, ఎస్సై శివనాంచారయ్య, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

గన్నేపల్లిలో చోరీకి పాల్పడిన నిందితులు అరెస్టు

12 తులాల బంగారం రికవరీ

కేసు వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు

Advertisement
 
Advertisement
Advertisement