ప్రజల సంతృప్తి మేరకు పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల సంతృప్తి మేరకు పనిచేయాలి

May 27 2026 10:32 AM | Updated on May 27 2026 10:32 AM

ప్రజల సంతృప్తి మేరకు పనిచేయాలి పరీక్ష కేంద్రాల తనిఖీ పిడుగుపాటుకు వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కలెక్టర్‌ విజయసునీత

మార్కాపురం టౌన్‌: ప్రజల సమస్యలను పరిష్కరించి వారి సంతృప్తి మేరకు పనిచేయాలని కలెక్టర్‌ ఎం విజయసునీత అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌, పెన్షన్స్‌పై మంగళవారం ఎంపీడీఓ, మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్‌ పంపిణీలో నిర్లక్ష్యం వహించకుండా జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ ఇవ్వడం లేదని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కొంత వెనుకబాటు కనిపిస్తోందని, దాన్ని సరిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, డీఆర్‌డీఏ ఇన్‌చార్జి పీడీ నీలకంఠారెడ్డి, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలను స్క్వాడ్‌ సభ్యులు తనిఖీ చేసినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పదో తరగతి హిందీ పరీక్షకు 175 మందికి గాను 57 మంది హాజరు కాగా 118 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఏపీఓఎస్‌ఎస్‌ (ఎస్‌ఎస్‌సీ) ఇంగ్లిష్‌ పరీక్షకు మొత్తం 492 మంది విద్యార్థులకు గాను 392 మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్‌ఎస్‌ (ఇంటర్మీడియెట్‌) తెలుగు పరీక్షకు 519 మందికి గాను 407 మంది హాజరు కాగా 112 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

కందుకూరు రూరల్‌: పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని విక్కిరాలపేట పొలాల్లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విక్కిరాలపేట గ్రామానికి చెందిన యరయాల మాలకొండయ్య గ్రామ సమీపంలో సరుడు వేర్లు తీసేందుకు కూలీ పనికి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం గాలివాన, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి పని నుంచి ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడి మాలకొండయ్య (61) మృతి చెందాడు. గమనించిన బంధువులు 108 వాహనంలో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరొకరికి గాయాలు

అద్దంకి రూరల్‌: బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన అద్దంకి మండలంలోని రేణింగవరం రోడ్డులో జార్లపాలెం గ్రామం సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. జె. పంగులూరు ఎస్సీ కాలనీకి చెందిన జశ్వంత్‌(19), మైకేల్‌లు పని నిమిత్తం అద్దంకి వచ్చి తిరిగి పంగులూరుకు వెళ్తుండగా మార్గమధ్యంలో రేణింగవరం గ్రామ సమీపంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. జస్వంత్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మైకేల్‌కు గాయాలవడంతో 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ సుబ్బరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement