కందుకూరు: తీవ్ర ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంగళవారం వరుణుడి కరుణతో కాస్త ఉపసమనం లభించినా భీకర గాలివాన బీభత్సం సృష్టించాయి. మంగళవారం సాయంత్రం వరకు భరించ లేని ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే సాయంత్రానికి ఆకాశం ఒక్కసారిగా మేఘామృతమై భారీ ఈదరుగాలులతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. బలంగా వీచిన ఈదురు గాలుల ధాటికి పట్టణంలో పలుచోట్ల చెట్లు నేలకూడంతో పాటు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే శ్రీనగర్ కాలనీలో బొట్లగుంట శ్రీనివాసులు అనే వ్యక్తి రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలుల ఉధృతితో ఇంటిపై ఉన్న రేకులు మొత్తం ఎగిరిపోయాయి. దీంతో ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం తడిసిపోయాయి. చుట్టుపక్కల వారు వచ్చి వారికి సాయం అందించారు. మామిడి రైతులను కూడా తీవ్ర దెబ్బతీసింది. కందుకూరు చుట్టుపక్క ఉన్న మామిడి తోటల్లో కాయలు పూర్తిగా నేలరాలాయి. ప్రస్తుతం కాయలు బాగా పక్వానికి వచ్చి కోత దశలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో కాయలు రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొండపి: మండలంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపో యాయి. తహసీల్దార్ కార్యాలయంలో వేపచెట్టు కూలిపోగా.. గురుకుల పాఠశాల ఎదురుగా భారీ చెట్టు రోడ్డుపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రెవెన్యూ, పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రోడ్లపై పడిన చెట్లను తొలగింపు ప్రక్రియను తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు, సీఐ వైవీ రమణయ్య, ఎస్సై త్యాగరాజు, సిబ్బంది పర్యవేక్షించారు.
పొన్నలూరు: మండలంలో మంగళవారం ఈదురు గాలులతో కూడిన ఓమోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు, సాయంత్ర పూట ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఓమోస్తారు వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. ఒక్కసారిగా వీచిన గాలులకు పొన్నలూరు, వెల్లటూరుతో పాటు పలు గ్రామాల్లో చెట్లు విరిగి కిందపడిపోయాయి. అలాగే అక్కడక్కడ పొగాకు బ్యారన్‌ల రేకులు ఎగిరిపోయాయి. కొన్ని గ్రామాల్లో బయట ఆరబోసిన మిరపకాయలు కూడా తడిచిపోయినట్లు రైతులు తెలిపారు. ఈదురుగాలుల వలన కొన్ని గ్రామాల్లో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కందుకూరు రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం గాలివాటన భీభత్సం సృష్టించింది. మోపాడు గ్రామాలో ఎం.రాముకు చెందిన గొర్రెలకు వేసిన రేకుల షెడ్డు రేకులు ఎగిరిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోయాయి. కొన్ని గ్రామాల్లో చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్‌ను పునరుద్ధరిస్తున్నారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి వాన కురిసింది.


