● ఎస్పీ హర్షవర్థన్ రాజు
ఒంగోలు టౌన్: మూగ జీవాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 53 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా మరిన్ని ప్రత్యేక టీంలను నియమించినట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్‌ను నియమించినట్లు వెల్లడించారు. పోలీసు, పశుసంవర్థక శాఖ, రెవెన్యూ శాఖలతో కలిసి ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్ పోస్టులు, టోల్ గేట్లు, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, కోర్టు మార్గదర్శకాలను, జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించే వారిపై కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా మూగజీవాలను తరలించడం, అనుమతులు లేకుండా రవాణా చేయడం, జంతు హింసకు పాల్పడడం వంటి చర్యలను సహించేది లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో బక్రీదు పండుగ జరుపుకునేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎవరైనా శాంతి భద్రతలు, సామాజిక సామరస్యం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా పశువులను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సమీపంలోని పోలీసుస్టేషన్లో తెలియజేయాలని, చట్టాన్ని చేతుల్లో తీసుకొని భౌతిక దాడులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందినప్పుడు పశు సంరక్షణ కార్యకర్తలు పోలీసులతో కలిసి వెళ్లి జాయింట్ కమిటీ ద్వారానే చర్యలు చేపట్టాలని సూచించారు. సంతలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మత సామరస్యానికి భంగం కలగకుండా పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు కమ్యూనల్ సెన్సిటివ్ ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మసీదులు, సున్నితమైన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు. గో వధ, పశువుల అక్రమ రవాణాపై ఏదైనా సమాచారం ఉంటే 9121102242, 9121102266, 9121102116 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


