ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఈదురుగాలుల బీభత్సం

May 26 2026 8:12 AM | Updated on May 26 2026 8:12 AM

మేడపి టోల్‌ గేట్‌వద్ద కూలిన హోర్డింగ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తాటిపర్తి

గాలి బీభత్సానికి రోడ్డుకు అడ్డంగా కూలిన మేడపి టోల్‌ గేట్‌

యర్రగొండపాలెం: రోహిణి కార్తె ప్రారంభమైన రోజే ప్రకృతి విలయ తాండవం సృష్టించింది. సోమవారం పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ఈ సంవత్సరం రోహిణి కార్తె ప్రభావం అంతగా ఉండదనుకున్నారు. వెనువెంటనే గాలి బీభత్సవం సృష్టించింది. పలు ప్రాంతాల్లో చెట్టు విరిగి పడ్డాయి. రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. దాదాపు 2 గంటల పాటు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ప్రజలు భయం భయంగా గడిపారు. కొలుకుల రోడ్డులో గృహం పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఉన్న పిల్లలు ఆడుకోవటానికి పక్కింట్లోకి వెళ్లారు. గృహిణి బొడ్డు మంగమ్మ పనుల నిమిత్తం బయటికి వెళ్లింది. ఈ తరుణంలో వీచిన గాలికి రేకులతో నిర్మించుకున్న ఆ గృహం నేలమట్టమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. త్రిపురాంతకం మండలంలోని మేడపి టోల్‌గేట్‌ హోర్డింగ్‌ రోడ్డుకు అడ్డంగా విరిగి పడింది. ఈ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలు లేకపోవడంతో ప్రమాదం చోటుచేసుకోలేదు. ఆ ప్రాంతంలో పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టోల్‌గేట్‌ వద్ద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో 5 విద్యుత్‌ స్తంభాలు పూర్తిగా విరిగిపడ్డాయి. ఆయా ప్రాంతాల్లోని 15 స్తంభాలపై చెట్లు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు ఏఈ కిషోర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు. మార్కాపురం రోడ్డులో రెండు వేప చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. విద్యుత్‌ ఏఈ కార్యాలయానికి అడ్డంగా వేప చెట్టు కూలింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న క్రీడా ప్రాంగణం పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. బస్టాండ్‌ సెంటర్‌ నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు కురిసిన వర్షం నీరు ఏరులై పారింది. ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిన సమాచారం ఇంకా తమకు అందలేదని, మంగళవారం ఉదయం నియోజకవర్గంలో పర్యటించి పంట నష్టం అంచనా వేస్తామని ఆ శాఖాధికారి పి.ఆదిరెడ్డి తెలిపారు.

కురిచేడు: మండలంలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలుల ధాటికి రైతుకు చెందిన రేకుల షెడ్‌, పైపులు ధ్వంసమయ్యాయి. మండలంలోని కాటంవారిపల్లె గ్రామానికి చెందిన ఆవుల వెంకటరెడ్డి వ్యవసాయానికి సంబంధించిన పైపులు, ట్రాక్టరు, సామాన్లు పెట్టుకునేందుకు పంటపొలంలో సుమారు రూ.10 లక్షలతో రేకులషెడ్డు నిర్మించుకున్నాడు. ఆదివారం రాత్రి అర్ధంతరంగా పెనుగాలులు వీచి స్వల్పంగా వర్షం కురిసింది. ఆ పెనుగాలుల బీభత్సానికి రేకులు లేచి పొలాల్లో పడ్డాయి. రూ.5 లక్షల విలువైన పైపులు కూడా పగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కూలిన ఇళ్లు, నేలకూలిన రేకుల షెడ్లు

రోడ్డుకు అడ్డంగా విరిగి పడిన చెట్లు

Advertisement
 
Advertisement
Advertisement