సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని నోటిఫికేషన్ నుంచి ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఎంపికల వరకు భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, కొండపి ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఇది మెగా డీఎస్సీ కాదని పూర్తిగా మాయ డీఎస్సీగా మారిందని అభివర్ణించారు. విద్యా శాఖమంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
లోకేష్ అట్టర్‌ఫ్లాప్..
విద్యాశాఖలో రోజురోజుకు వెలుగుచూస్తున్న అవినీతి కథనాలు చూస్తుంటే విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌కు ఆ శాఖపై ఏ మాత్రం పట్టు ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. విద్యాశాఖను పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకునే లోకేష్‌కు విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సారీ సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి మెగా డీస్సీ పేరుతో భారీ ప్రచారం చేసుకుందన్నారు. కానీ నియామకాల ప్రక్రియలో పారదర్శకత కొరవడిందన్నారు. నోటిఫికేషన్ నుంచి ప్రశ్నాపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీ వరకు అన్ని చోట్లా అక్రమాలు జరిగాయని విమర్శించారు. లక్షలాది ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత భవిష్యత్‌తో చెలగాటమాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రశ్నకు బదులేది..
డీఎస్సీ–2025 అవకతవకలపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. నవీన్ అనే అభ్యర్థి కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచాడని, అతను ఎస్‌ఈఆర్టీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేశాడని, ప్రశ్నాపత్రాల కూర్పులో భాగమయ్యాడని, అతనికి ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించడం వాస్తవం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికీ మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయడం లేదని, అభ్యర్థులకు మెసెజ్‌లు పంపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున విక్రయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయని, సీఎం బంధువుగా చెప్పుకునే వ్యక్తి ఈ పోస్టుల విక్రయంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రతిభావంతులైన నిరుద్యోగులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో గానీ సిట్టింగ్ జడ్జితో గా నీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవకాశాలు కోల్పోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. విద్యాశాఖ పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి సురేష్ డిమాండ్ చేశారు.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అట్టర్ ఫ్లాప్
మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
లోకేష్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి
మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ డిమాండ్


