● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశించారు. మట్కా, పేకాట, కోడిపందేలు వంటి అసాంఘిక కార్యకలాపాలు, జూదాలను పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం, మార్కాపురం జిల్లాల పోలీసు అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, మిస్సింగ్, రోడ్డు ప్రమాదాలపై సమీక్షించిన ఎస్పీ పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, అరెస్టులు, దర్యాప్తు పురోగతి, కేసుల ఛేదన, నేర నియంత్రణకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించాలని, బహిరంగ మద్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో గుర్తు తెలియని మృతదేహాలు, కారణం తెలియని మరణం కేసులు, అనుమానాస్పద మృతి కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా కేసుల్లో అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసి పూర్తిస్థాయి సాక్ష్యాధారాలను సేకరించాలని, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టులను త్వరితగతిన తెప్పించుకొని పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి కుంభాకార దర్పణాలు, సైన్ బోర్డులు, బారికేడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలకు సంబంధించి ఎఫ్‌ఏఆర్, ఐఏఆర్ అండ్ డీఏఆర్ రిపోర్టులను నిర్ణీత కాలవ్యవధిలో కోర్టుకు సమర్పించాలని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్ సాంకేతికత అప్లికేషన్‌లో భాగంగా సెంట్రల్ క్రైం ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం, సీసీ నిఘా, డ్రోన్ సర్వైలెన్స్, ఇతర డిపాజిట్ ప్లాట్‌ఫాంలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. నేరాలను ముందుగానే గుర్తించి ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించాలని కోరారు. బక్రీద్ పండుగ వేడుకలు, కార్యక్రమాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ సీఐ దేవ ప్రభాకర్, సీసీఎస్ సీఐ బీమానాయక్, ఐటీ కోర్ సీఐ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


