కందుకూరు రూరల్: రాజ్యాంగపర హక్కుల సాధన కోసం దళితులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ శాసనమండలి సభ్యులు గోరటి వెంకన్న పిలుపునిచ్చారు. కందుకూరులోని దూబగుంటలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మట్లాడుతున్న మాల, మాదిగల మధ్య ఉన్న సమస్యలను ఇరువర్గాలు వారు సామరస్యంతో పరిష్కరించుకోవాలే తప్ప మనువాద పాలకులు ఆడే నాటకంలో బలిపశువులు కాకూడదన్నారు. గౌతమ బుద్ధుని మార్గంలో అంబేడ్కర్ సిద్ధాంత వెలుగులో రాజ్యాధికారం సాధించినప్పుడే బహుజనుల విముక్తి సాధ్యపడుతుందన్నారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ మాల, మాదిగలు ఇతతుల అధికారం కోసం పాకులాడుతున్నారే తప్ప వారి రాజ్యాధికారం కోసం పొరాటాలు చేయడం లేదన్నారు. ఓటు అనే ఆయుధంతో మన సీట్లను మనమే గెలిపించుకొని అధికారాన్ని చేపట్టాలన్నారు. బహుజన కళామండలి ఉదయభాస్కర్ బృందం ఆలపించిన సామాజిక చైతన్య గీతాలు, గోరటి వెంకన్న ఆట, పాట సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బహుజన కెరటాలు వ్యవస్థాపకుడు పల్నాటి శ్రీరాములు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ప్రముఖ సాహిత్య విమర్శకులు ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు, కావలి ఎంఈఓ బండి గోవిందయ్య, ఎస్‌డబ్ల్యూఅండ్ ఎస్‌ఎం హాస్టల్ పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌడపేరు కోటిలింగం, కళ్లగుంట మోహనరావు, బీటీఏ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా, చలంచర్ల బ్రహ్మయ్య, రిటైర్డ్ లెక్చరర్ కొప్పోలు కామేశ్వరి, బండి ధనమ్మ, దాసరి బాలకృష్ణ, కట్టా సుచరిత పాల్గొన్నారు.


