● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సిటీ: మీ కోసం కార్యక్రమానికి సమస్యలపై వచ్చే అర్జీలను ప్రజల సంతృప్తే లక్ష్యంగా సహేతుకంగా, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఎస్‌డీసీలు కళావతి, మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా కారణంతో ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే ఆ కారణాన్ని అర్జీదారునికి అర్థమయ్యేలా వివరించి ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. అధికారి తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులు మళ్లీ రీ ఓపెన్ కాకూడదని, ఒకవేళ ఏదైనా అర్జీ రీ–ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 286 అర్జీలు రాగా, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.


