● కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సిటీ: ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు యువత ముందుకు రావాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. సోమవారం ఒంగోలు మండలం దసరాజుపల్లి గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్థానికులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. దసరాజుపల్లిలో ఈ పార్కుకు అవసరమైన రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.


