మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026 – 8లో..

న్యూస్‌రీల్‌

సొంత పొలంలో మట్టి తవ్వుకున్నా...

గురుకులాల్లో మిగులుసీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

మద్దిపాడులో కొండలను మింగేస్తున్న టీడీపీ నాయకులు

మైనింగ్‌ డీడీ రాజశేఖర్‌ ఫిర్యాదుతో నలుగురు టీడీపీ నేతలపై మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదు

కొత్తపట్నం మండలంలో ఇరిగేషన్‌ చెరువుల్లో పడిన పచ్చ దొంగలు

చెరువు నుంచి కొప్పోలులోని కీలకనేత వెంచర్‌కు మట్టి తరలింపు

సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన అల్లూరు గ్రామస్తులు

యర్రగొండపాలెంలో సొంత పొలంలో మట్టి తవ్వుకున్నా కప్పం కట్టాల్సిందే

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

కీలక నేతల అండ చూసుకొని రెచ్చిపోతున్న పచ్చ తమ్ముళ్లు

కొండలను కొల్లగొడుతున్నారు..కుంటలను గుల్లచేస్తున్నారు..చెరువుల్లో విధ్వంసం..చేతికి అందిన కాడికి మట్టికొట్టుకొని పోతున్నారు. అడ్డూ అదుపూ లేని తవ్వకాలతో కొండలు కరిగిపోతున్నాయి. గ్రామస్తుల ఫిర్యాదులను పెడచెవిన పెడుతున్నారు. అధికారులను లెక్క చేయడంలేదు. నీకు చేతనైంది చేసుకోపో అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నియోజకవర్గాల్లో కీలక నేతకు కప్పం కడితే చాలు ఎలాంటి చలానాలు కట్టకపోయినా పర్వాలేదంటూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు మట్టి కొల్లగొట్టే అనకొండలు.

చెరువులు మింగేసి..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మద్దిపాడు మండలంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. కొన్ని రోజులుగా మండలంలోని చెరువులు, కుంటల్లో అక్రమంగా మట్టిని తవ్వుకుంటున్నారు. ముఖ్యంగా మద్దిపాడు మండలంలోని అన్నంగి, బూరేపల్లి, గడియపూడి, గార్లపాడు పరిసర ప్రాంతాల్లోని కొండలను సైతం వదిలిపెట్టకుండా మట్టి దోచుకుంటున్నారు. ఇక్కడ కొండల్లో ఎర్ర మట్టి ఉంటుంది. దీనిపై కన్నేసిన స్థానిక టీడీపీ నాయకులు ఏకంగా జేసీబీలను పెట్టి కొండలను కొల్లగొడుతున్నారు. వందల సంఖ్యలో టిప్పర్లు పెట్టి మట్టిని అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి తవ్వకాలపై మైనింగ్‌ డీడీ రాజశేఖర్‌ టీడీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. మద్దిపాడు పోలీసులు అన్నంగి గ్రామ టీడీపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న నారిపెద్ది అనిల్‌, టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జి అన్నాబత్తిన శివ, బూరేపల్లి గ్రామ టీడీపీ సర్పంచ్‌ రావిపాటి శేషయ్య, గుండ్లాపల్లికి చెందిన రాముడు తదితరులపై కేసు నమోదు చేయడంతో మండలంలో మట్టి దోపిడీ చర్చనీయాంశంగా మారింది.

బూరేపల్లి కొండ మాయం..

అన్నంగి పంచాయతీ పరిధిలో బూరేపల్లి గ్రామంలో 440.20 ఎకరాల్లో విస్తరించి ఉన్న బూరేపల్లి కొండ ఇప్పుడు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ కొండలోని సర్వేనంబర్‌ 472లో 94.42 ఎకరాలు పోలీసు బెటాలియన్‌కు కేటాయించారు. మిగిలిన ఎర్రకొండను పచ్చ తమ్ముళ్లు తవ్వుకొని మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పగలంతా పొదల మాటున ఉంచిన జేసీబీలు రాత్రయితే చాలు రంగంలోకి దిగుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జేసీబీతో తవ్వకాలు చేస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు పెట్టి మట్టిని తరలిస్తున్నట్లు మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదులు చేశారు. టిప్పరు మట్టి రూ.10 వేలకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి రోజూ సుమారు 100 టిప్పర్ల వరకు తరలిస్తున్నారని తెలుస్తోంది. సగటున నెలకు రూ.3 కోట్లకు పైగానే మట్టి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులోంచి టీడీపీ కీలక నేతలకు టిప్పర్‌కు రూ.2 వేల చొప్పున కప్పం కడుతున్నట్లు టీడీపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. కొండను ఇష్టమొచ్చినట్లు తవ్వేయడంతో ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఏర్పడ్డాయి. రేపు వర్షాలకు ఈ గుంతలు నిండితే అటుగా వచ్చే పశువులకు, పశుపోషకులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

కొత్తపట్నం చెరువుల్లో మట్టి మాయం...

జిల్లా కేంద్రానికి చెందిన ఒక కీలక నేత వెంచర్‌కు కొత్తపట్నం మండలంలోని అల్లూరు చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నట్లు ఆ గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం కలెక్టర్‌ కు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్‌ ఏఈ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందనలేదని కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్లూరు గ్రామంలోని చాపాయి, చక్రాయి ఇరిగేషన్‌ చెరువుల్లో నుంచి వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లను ద్వారా ఒంగోలు మండలంలోని కొప్పోలు సమీపంలో కీలక నేత వెంచర్‌కు మట్టిని తరలిస్తున్నారు. సుమారు 60 ఎకరాల్లో ఈ వెంచర్‌ వేస్తున్నట్లు సమాచారం. దీన్ని చదును చేయడానికి వందలాది టిప్పర్ల మట్టి అవసరమవుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఇరిగేషన్‌ అధికారుల అనుమతి తీసుకున్న దాఖలాలు లేవు. పంచాయతీ తీర్మానం చేయలేదు. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో సీనరేజ్‌ కట్టకుండా అనధికారికంగా, అక్రమంగా మట్టిని తవ్వుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ అక్రమంగా మట్టి తవ్వుకొంటూ విక్రయాలు చేస్తున్నారు. పెద్దారవీడు మండలంలో మట్టితవ్వకాలు మితిమీరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నియోజకవర్గంలో సొంత పొలంలో రైతులు మట్టి తవ్వుకున్నా కీలక నేతకు టిప్పర్‌కు రూ.350 కప్పం కట్టాల్సి వస్తుందని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఒక బొలేరో వాహనంలో కొంత మంది వ్యక్తులు మైనింగ్‌ అధికారులమని తిరుగుతూ టిప్పర్‌, ట్రాక్టర్‌ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కనిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మాటున అడ్డగోలుగా మట్టి తవ్వకాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రైల్వే పనులు, హైవే పనుల కోసమని మట్టిని తవ్వుకుంటున్న కొందరు వ్యక్తులు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల 15 ట్రాక్టర్లకు పర్మిషన్‌ తీసుకొని 50 ట్రాక్టర్లకు మట్టిని తవ్వుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. సింగరాయకొండ మండలంలోని శానంపూడి, పాత సింగరాయకొండ గ్రామాల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పాత సింగరాయకొండ పంచాయతీలో ఈనాం, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండపి నియోజకవర్గంలోని ఆరు ఇరిగేషన్‌ చెరువుల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. కందుకూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇరిగేషన్‌ చెరువులను తవ్వేస్తూ మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలిస్తున్నారని తెలుస్తోంది.

ఒంగోలు సిటీ: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్మీడియెట్‌ ఫేజ్‌–1, ఫేజ్‌–2 కేటాయింపుల అనంతరం మిగిలిన ఖాళీల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీసీఓ డి.జయ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ ప్రవేశ పరీక్షకు హాజరై ఎంపిక కాలేని వారు, ఎంపికై చేరని వారు, చేరి స్లైడింగ్‌ కోరిన విద్యార్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్‌, ర్యాంక్‌ కార్డు, ఆధార్‌, స్టడీ సర్టిఫికెట్‌, ఇతర సంబంధిత ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. కౌన్సెలింగ్‌ జరిగే తేదీ ఉదయం 9 గంటల్లోపు విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కావాలని కోరారు. కురిచేడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో 5వ తరగతి బాలురుకు ఈనెల 26వ తేదీ, కొండపిలోని గురుకులంలో 5వ తరగతి బాలికలకు ఈనెల 27వ తేదీ, సింగరాయకొండలోని గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ (జనరల్‌) బాలికలకు ఈనెల 29వ తేదీ, అలాగే దర్శిలోని గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ బాలురకు ఈ నెల 30వ తేదీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు.

పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

ఒంగోలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈఓ సీవీ రేణుక తెలిపారు. తెలుగు పరీక్షకు మొత్తం 1288 మంది విద్యార్థులు నమోదుకాగా, 1094 మంది హాజరయ్యారు. 194 మంది గైర్హాజరయ్యారు. అలాగే అపాస్‌ (ఎస్‌ఎస్‌సీ) తెలుగు పరీక్షకు 658 మంది విద్యార్థులకు గాను 546 మంది హాజరుకాగా, 112 మంది గైర్హాజరయ్యారు. అపాస్‌ (ఇంటర్మీడియెట్‌) ఇంగ్లిష్‌ పరీక్షకు 326 మందికిగాను 257 మంది హాజరయ్యారు. 69 మంది గైర్హాజరయ్యారు. మార్కాపురం జిల్లా కలెక్టర్‌ మార్కాపురం జెడ్పీ గరల్స్‌ హైస్కూల్‌ను తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను స్క్వాడ్‌ సభ్యులు తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లాలో డీఈఓ రేణుక నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

మద్దిపాడు మండలం అన్నంగి–బూరేపల్లి గ్రామాల మధ్య కొండను తవ్వి గ్రావెల్‌ తరలించడంతో ఏర్పడిన గోతులు

గుండ్లకమ్మకు ప్రమాదం...

మట్టి దొంగల ధన దాహానికి గుండ్లకమ్మ ప్రమాదంలో పడిందని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండ్లకమ్మ జలాశయానికి రక్షణగా కట్టగా పోసిన మట్టిని తవ్వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు రానున్నాయి. వర్షాలు దంచికొడితే గుండ్లకమ్మ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే చుట్టు పక్కల గ్రామాలు నీటమునిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement