గిట్టుబాటు ధరలు లేక రైతులు భారీగా నష్టపోతున్నారు వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారు రైతులకు అండగా నిలిచేందుకు వేలం కేంద్రానికి వస్తే వివాదం చేసే ప్రయత్నం గత ప్రభుత్వంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మరీ రైతులను ఆదుకున్నాం పొగాకు రైతులను ఆదుకోకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్
కందుకూరు:
కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక అప్పుల బాధతో ఉరేసుకునే పరిస్థితి ప్రస్తుతం వచ్చిందని, గతంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని పొగాకు రైతులు ఎదుర్కోలేదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ అన్నారు. స్థానిక పామూరు రోడ్డులోని రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ప్రస్తుతం వేలం జరుగుతున్న తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుర్రా మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ తరఫున వేలం కేంద్రానికి వస్తున్నారని తెలుసుకుని, 7.30 గంటలకే వేలం ముగించేశారన్నారు. ఇదేమని అడిగితే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వేలం ముగించామని చెప్తున్నారని మండిపడ్డారు. టీడీపీ రెండేళ్ల పాలనలో పొగాకు రైతులకు ఇప్పటి వరకు లాభాలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్వింటా రూ.36 వేల వరకు ధరలు పలికాయని, కానీ ప్రస్తుతం కనీస మద్దతు ధర దేవుడెరుగు ఒక బ్యారన్‌కు రూ.5 లక్షల వరకు రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పారు. ఇదేమని పొగాకు బోర్డు అధికారులను అడిగితే రకరకాల సాకులు చెప్తున్నారన్నారు. వ్యాపారులంతా ఒకేమాట మీదకు వచ్చి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. వ్యాపారుల సిండికేట్ వల్లే కనీస ధరలు రావడం లేదని, వేలం ముందుకు సాగడం లేదన్నారు. ఇప్పటికై నా వ్యాపారులు మారి రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని, రైతుల పంట సాగు చేయకపోతే వ్యాపారులే తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అలాగే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేని ప్రతిసారి గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని వివరించారు. కానీ ఈ ప్రభుత్వం పొగాకుతో పాటు వరి, మొక్కజొన్న, కంది వంటి ఏ పంటలకు కూడా మద్దతు ఇవ్వలేదన్నారు. కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని, గిట్టుబాటు ధరలు కల్పించకపోతే రైతుల తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.
7.30 గంటలకే వేలం క్లోజ్:
సాధారణంగా ప్రతిరోజు వేలం ప్రక్రియ ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్యలో ప్రారంభమవుతుంది. అయితే సోమవారం మాత్రం 7.30 గంటలకే వేలం మొత్తం ముగిసి, బేళ్లను తరలించడం కూడా జరిగిపోయింది. కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లోను ఇదే పరిస్థితి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతుగా వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేస్తారని ముందస్తు సమాచారంతోనే, అధికారులు వేలాన్ని ఉదయాన్నే ముగించేశారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ఉదయాన్నే వేలాన్ని ప్రారంభించి ముగించినట్లు అధికారులు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఇలా ఎందుకు చేయడం లేదని నిలదీస్తే అధికారుల నుంచి సమాధానం కరువైంది.
పొగాకు బేళ్లు తగలబెట్టి నిరసన
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పామూరు రోడ్డులోని పొగాకు వేలం కేంద్రం వద్ద బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో రైతులు పొగాకు బేళ్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పామూరు రోడ్డుపై పొగాకు బేళ్లు వేసి ఆందోళనకు దిగారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పొగాకు బేళ్లు తగలబెట్టడానికి వీల్లేదని, ట్రాఫిక్ అంతరాయం అంటూ పట్టణ ఎస్సై శివనాగరాజు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బుర్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా పోరాడుతుంటే పోలీసుల ఆంక్షలు ఏంటి అంటూ నిలదీశారు. పొగాకు రైతులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని, పొగాకు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వేలం నిర్వహణాధికారిని కలిసి రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
టీడీపీ నాయకుని అతి
బుర్రా మధుసూదన్‌యాదవ్ రైతులతో కలిసి వేలం కేంద్రాన్ని సందర్శిస్తున్న సమయంలో రైతు సంఘ నాయకుడు, టీడీపీ నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా ఏదైనా ఉంటే రైతులకు అండగా నిలబడే ప్రయత్నం చేయాలి గానీ, ఇలా వ్యాపారులు, ప్రభుత్వం తరఫున మాట్లాడడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చుట్టూ ఉన్న రైతులు ఒక్కసారిగా రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన పోరాడేందుకు వస్తే అక్కడకి వచ్చి రెచ్చగొట్టేలా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు. టీడీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారంటూ బుర్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటనను వక్రీకరించిన టీడీపీ సోషల్‌మీడియా బుర్రా రైతు పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ ప్రచారం చేసుకోవడం వింతగా మారింది. అసలు ఏం జరిగిందనేది కూడా తెలుసుకోకుండా వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇక్కడ కొసమెరుపు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పండిట్ కామరాజు, నాయకులు షేక్ రఫి, తోకల కొండయ్య, గణేశం గంగిరెడ్డి, ముప్పవరపు కిశోర్, నన్నం పోతురాజు, అనుమోలు లక్ష్మీనరశింహం, నోటి వెంకటేశ్వరరెడ్డి, పెన్నా క్రిష్ణయ్య, చీమల వెంకటరాజా, పావం కొండయ్య, వల్లూరి కోటేశ్వరరావు, నగళ్ల నారయ్య, బిల్లా రమణయ్య, పాలవెల్లి అమర్నాథ్‌రెడ్డి, కాపులూరి మధుసూదన్, చనమాల కోటేశ్వరరావు, ఉప్పుటూరి నాగేశ్వరరావు, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, బద్దిపూడి జయరావు, చింతం వెంకారెడ్డి, కట్టా హనుమంతరావు, కాట్రగడ్డ వెంకట్రావ్, వంకాయలపాటి వెంకటేశ్వర్లు, కొత్త మహేష్, షేక్ దస్తగిరి, గొర్ల రమేష్, ఈర్ల వెంకటేశ్వర్లు, తల్లపనేని గోఫి, పత్తిపాటి శ్రీనివాసులు, గోకరాజు సుబ్బారావు, అన్నాబత్తిన మాల్యాద్రి, కొండూరు నర్సారెడ్డి, తన్నీరు ధరణి, లక్ష్మీ, ఆదాంబి తదితరులు పాల్గొన్నారు.
పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసన
సరైన మద్దతు ధర లేక ఒకవైపు అల్లాడిపోతుంటే వేలానికి తీసుకొచ్చే 50 శాతం బేళ్లను కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారని రైతులు వాపోయారు. అందుకు నిరసనగా రైతులు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు కొండపిలోని పొగాకు బోర్డు వద్ద బేళ్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొండపి ఎస్సై త్యాగరాజు చేరుకొని పొగాకు రైతులు, నాయకులతో మాట్లాడి నిరసన కార్యక్రమాన్ని విరమింపచేశారు.
పొగాకుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతులు పొదిలిలో పొగాకు వేలాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతరం వేలం కేంద్రం నుంచి ఒంగోలు–కర్నూలు రహదారి వరకు ర్యాలీ చేశారు. నిరసన చేయడానికి వచ్చిన రైతు సంఘ నాయకులను, రైతులను పోలీసులు అడ్డుకొని వెనక్కి పంపారు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రకాశం జిల్లా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వెల్లంపల్లి పొగాకు బోర్డు వద్ద నిరసన చేపట్టారు.
ఒంగోలు 1వ వేలం కేంద్రంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించి వారికి న్యాయం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
పొగాకు రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కనిగిరి టుబాకో బోర్డులో సోమవారం రైతులు నిరసన తెలిపారు.


