ఎండ
ఒంగోలు టౌన్: రోహిణి కార్తె తొలిరోజు ఎండలు మండిపోయాయి. ఉమ్మడి జిల్లా అంతటా భానుడు ప్రతాపాన్ని చూపించాడు. 34 మండలాలు నిప్పుల కొలిమిలా భగభగమన్నాయి. మూడు మండలాల్లో 45పైన, 12 మండలాల్లో 44 డిగ్రీలు దాటాయి. దీంతో జనం అల్లాడిపోయారు. వేడికి తోడు వడగాలులు, ఉక్కపోతలు వేధించడంతో జనం బెంబేలెత్తి పోయారు. తెల్లవారుజామున 4 గంటల తరువాత వర్షం కురవడంతో ఉదయం 11 గంటల వరకు వాతావరణం చల్లగా ఉంది. దీంతో జనం కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే 12 గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. దాంతో జనం హడలిపోయారు. జిల్లా అంతా నిప్పులు కొలిమిలా మారిపోయింది. సోమవారం ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని అన్నీ మండలాల్లోనూ 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా అద్దంకి, బల్లికురవ, ఎస్‌ఎన్‌పాడు 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జే.పంగులూరులో 44.9, కనిగిరి 44.7, ఒంగోలు 44.6, ఎన్‌జీపాడు, త్రిపురాంతకంలో 44.5 డిగ్రీలు నమోదైంది. పుల్లలచెరువు 44.3, చీమకుర్తి, కొండపి, మద్దిపాడుల్లో 44.1 డిగ్రీలు నమోదు కాగా కురిచేడు 43.9, ముండ్లమూరు, తాళ్లూరు 43.8 డిగ్రీలు, టంగుటూరు, పెద్దారవీడుల్లో 43.7 డిగ్రీల ఎండ దంచి కొట్టింది. కొరిశపాడు 43.6, హెచ్‌ఎంపాడు 43.4, వైపాలెం, దొనకొండ 42.9, కొనకనమిట్ల, మార్కాపురంలలో 42.8 డిగ్రీలు నమోదైంది. సంతమాగులూరు, రాచర్ల, బేస్తవారిపేట, కంభం, పెద్ద దోర్నాల 42.7 డిగ్రీలు, పొదిలి 42.6, కందుకూరు, కొత్తపట్నం, పొన్నలూరు, దర్శి 42.5, తర్లుపాడు 42 డిగ్రీలు నమోదైంది. అయితే జిల్లాలో పలు చోట్ల ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. వైపాలెం, త్రిపురాంతకం మండలాల్లో మధ్యాహ్నం వరకు ఎండ ప్రతాపం చూపించగా సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది.
వడదెబ్బకు ఇద్దరు మృతి
జె.పంగులూరు: వారం రోజులుగా ఉన్న ఎండల తీవ్రత, ఉక్కపోత, వేడి వడగాడ్పులకు పండుటాకులు రాలిపోతున్నారు. మండల పరిధిలోని బూదవాడ గ్రామానికి చెందిన నూతలపాటి దయమ్మ (65) ఆదివారం రాత్రి వేడి గాలికి, వడ దెబ్బ తగిలి మృతిచెందింది.
ముండ్లమూరు మండలంలో..
ముండ్లమూరు: వడదెబ్బకు గురై లక్కిరెడ్డి సుబ్బమ్మ (85) మృతి చెందిన సంఘటన మండలంలోని పులిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా కాస్తున్న ఎండలకు సుబ్బమ్మ అస్వస్థతకు గురైంది. సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉదయం చల్లగా ప్రారంభమై మధ్యాహ్నంకల్లా విరుచుకుపడిన సూర్యుడు
అద్దంకి, బల్లికురవ, సంతనూతలపాడులో అత్యధికంగా 45.4 డిగ్రీలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు
తొలిరోజే భగభగలాడిన రోహిణీ కార్తే
వడదెబ్బకు ఇద్దరు మృతి


