న్యూస్‌రీల్
ఉదయం నుంచే వడగాలులు షురూ ఆదివారం ఉలవపాడులో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు మధ్యాహ్నానికి చండ ప్రచండంగా మారిన సూర్యుడు బయటకు వచ్చేందుకు జంకుతున్న జనం ఉమ్మడి జిల్లా అంతటా బంద్‌ను తలపించిన పట్టణాలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనాలు ఉక్కిరిబిక్కిరి
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026
ఎండతీవ్రతతో నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ సెంటర్
ఒంగోలు టౌన్:
జిల్లాలో ఈ ఏడాది ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్ నెల చివర నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చిన ఎండలు మే నాటికి తీవ్రంగా మారాయి. వారం రోజుల నుంచి జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒకటి రెండు మండలాలు మినహా మిగిలిన అన్నీ మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ వేడి మొదలవుతోంది. క్రమంగా మధ్యాహ్నంకల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. రాత్రి 11 గంటలకు కూడా వేడి గాలులు తగ్గడం లేదు. దాంతో పగలు రాత్రి వడగాలులు, ఉక్కపోతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎప్పుడూ రద్దీగా కనిపించే ఒంగోలు నగరంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎంత పనిపడినా బయటకు రావడానికి సాహసం చేయలేకపోతున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాతే జనాలు ఇంటి నుంచి బయటకు వస్తున్నారు.
ఉలవపాడులో
సూర్యుడి ఉగ్రతాండవం...
ఆదివారం జిల్లాలోని ఉలవపాడులో సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఉలవపాడులో జిల్లాలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. సంతనూతలపాడులో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టాలంటే భయపడిపోయారు.
నేడు, రేపు కూడా అవే ఉష్ణోగ్రతలు...
నేడు, రేపు కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మార్కాపురం జిల్లాలోని అన్నీ మండలాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదవుతుందని ప్రకటించింది. ఆదివారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన గిద్దలూరు, కొమరోలు, రాచర్ల, మార్కాపురంలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. గిద్దలూరులో 40.9, కొమరోలులో 40.5, రాచర్లలో 41ల చొప్పున ఒక్కో డిగ్రీ పెరుగుతుందని, మార్కాపురంలో ఏకంగా 3 డిగ్రీలు పెరిగి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, జె.పంగులూరులో సుమారు 45 డిగ్రీలు, అద్దంకి, సంతమాగులూరులో 44.8, గుడ్లూరులో 44.7, డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని, మిగిలిన అన్నీ మండలాల్లో కూడా ఒకటి రెండు మండలాలు మినహాయించి మిగిలిన అన్నీ మండలాల్లో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఒంగోలు అర్బన్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని ప్రకటించింది.
రోహిణి వచ్చేసింది బాబోయ్...
వేసవి కాలంలో రోహిణిలో రోళ్లు పగులుతాయని చెబుతుంటారు. ఈసారి రోహిణికి ముందే ఎండలు తన ప్రతాపం చూపాయి. ఇక నేటి నుంచి రోహిణి కార్తె కూడా వచ్చేసింది. 15 రోజులు రోహిణి కార్తె ప్రభావం ఉంటుంది. ఎండలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుటికే ఉష్ణోగ్రతలకు వడ గాలులు తోడవడంతో వేడి, ఉక్కపోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలో వడదెబ్బకు పలువురు మరణిస్తున్నారు. వేసవి ప్రభావంతో జనాలు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంపై జనాలు మండిపడుతున్నారు. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీలు, పంచాయతీలు మొద్దు నిద్రపోతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


