అప్‌గ్రేడ్‌కానున్న మార్కాపురం పోలీస్‌ స్టేషన్లు | - | Sakshi
Sakshi News home page

అప్‌గ్రేడ్‌కానున్న మార్కాపురం పోలీస్‌ స్టేషన్లు

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

పాకల బీచ్‌లో సాయంత్రం వేళ పర్యాటకుల సందడి

డీజీపీ ఆఫీసుకు ప్రతిపాదనలు

మార్కాపురం: జిల్లా కేంద్రంగా మార్కాపురం పట్టణం మారడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మార్కాపురం పోలీసు స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేయాలని డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలో కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం మార్కాపురానికి పట్టణ పోలీసుస్టేషన్‌తో పాటు రూరల్‌ పోలీసు స్టేషన్‌ కలిపి సీఐని ఏర్పాటు చేశారు. మార్కాపురం పట్టణ, రూరల్‌ పోలీసు స్టేషన్‌లను అప్‌గ్రేడ్‌ చేయాలని డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. 15 నుంచి 20 రోజుల్లో ప్రతిపాదనలకు ఆమోదం రానున్నట్లు తెలిసింది. అప్‌గ్రేడ్‌ కాగానే మార్కాపురం పట్టణ, రూరల్‌ పోలీసుస్టేషన్లకు సీఐ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. దీంతోపాటు పలువురు ఎస్సైలను కూడా అదనంగా నియమించనున్నారు. శాంతి భద్రతలపై పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నిర్వహణ, రౌడీషీటర్లపై నిఘా తదితర అంశాలపై ప్రత్యేక నిఘా పెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ స్టేషన్‌ ఇన్‌చార్జిలుగా ఎస్సైలు వ్యవహరిస్తున్నారు. అప్‌గ్రేడ్‌ కాగానే సీఐ స్టేషన్‌ ఇన్‌చార్జిగా ఉంటారు.

జిల్లా కేంద్రం కావడంతో ఇటీవల క్రైమ్‌ రేట్‌ కూడా పెరుగుతోంది. దొంగతనాలు, యాక్సిడెంట్లు, భూకబ్జా ఆరోపణలు, చిన్న చిన్న కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు రెండు స్టేషన్లను అప్‌గ్రేడ్‌ చేసి సీఐ స్థాయి అధికారిని నియమించాలని హోం శాఖకు నివేదికలు పంపారు. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందుకు సుముఖంగా ఉండటంతో త్వరలో మార్కాపురం పట్టణ, రూరల్‌ స్టేషన్లు అప్‌గ్రేడ్‌ కానున్నాయి. ప్రస్తుతం పట్టణంలో 40 మంది కానిస్టేబుల్స్‌, హోమ్‌గార్డులు, రూరల్‌లో కూడా అదే స్థాయిలో సిబ్బంది ఉన్నారు. మార్కాపురం మీదుగా పలు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. పట్టణ శివారులోని వై జంక్షన్‌ నుంచి ఒంగోలు, కర్నూలు జాతీయ రహదారి, మార్కాపురంలోని కుంట వద్ద నుంచి అనంతపురం–విజయవాడ జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా మార్గాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేరప్రవృత్తి కూడా పెరుగుతోంది. దీంతో పోలీసు సిబ్బంది సంఖ్య పెంచాలంటే స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో చాలామంది ట్రాఫిక్‌, కోర్టు డ్యూటీలు, ఎన్‌బీడబ్ల్యూ (నాన్‌ బెయిలబుల్‌ వారెంటు) అందజేయడం, వివిధ కేసుల్లో ఉన్న నేరస్తులను తీసుకురావడం, సెంట్రీ డ్యూటీలు ఇతరత్రా కార్యక్రమాలకు విధి నిర్వహణలో సిబ్బందిని కేటాయించడంతో ఉన్న సిబ్బందితో లా అండ్‌ ఆర్డర్‌, కేసు ఇన్వెస్టిగేషన్‌ చేయడం భారంగా మారుతోంది. ఇదే సమయంలో నైట్‌ బీట్లు కూడా పెంచారు. ఉదయం డ్యూటీ చేసే సిబ్బంది రాత్రిపూట ఒక్కొసారి చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అప్‌గ్రేడ్‌ చేయడం వలన మరో నలుగురు ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్స్‌ను నియమించే అవకాశం ఉంది. దీని ద్వారా ట్రాఫిక్‌ను, నేరాలను నియంత్రించవచ్చని, వివిధ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని స్థానిక పోలీసు అధికారులు భావిస్తున్నారు. హోంశాఖ నుంచి అనుమతి రాగానే మార్కాపురం రూరల్‌, టౌన్‌ పోలీస్‌స్టేషన్లు, సీఐ స్థాయి అధికారుల పాలనలోకి వెళ్లనుంది.

Advertisement
 
Advertisement
Advertisement