ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి ముగిసిన జీసీసీ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నాయకుడు

ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ డిమాండ్‌

ఒంగోలు సిటీ: ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు కలెక్టర్‌ రాజాబాబు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్‌.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 132 ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 555 మంది ఉపాధ్యాయ సిబ్బందికి గాను 115 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్లు, 15 మంది గణిత ఉపాధ్యాయులు, 18 మంది సోషల్‌ ఉపాధ్యాయులు, 12 మంది తెలుగు పండిట్లు, 10 మంది హిందీ పండిట్లు, 9 మంది పీఈటీలు, 8 మంది సైన్స్‌ ఉపాధ్యాయులు, ఇద్దరు క్రాఫ్ట్‌ టీచర్లు, 13 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది ఖాళీగా ఉన్నారని తెలిపారు. వీరికి వెంటనే కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లోకి సర్దుబాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు.

తాళ్లూరు: మండలంలోని తూర్పుగంగవరం యూత్‌ ఆధ్వర్యంలో జీసీసీ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగిసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో మాధవరం ఆనంద్‌ లెవెన్స్‌–తూర్పుగంగవరం హోం జట్టు తలపడ్డాయి. ఇందులో తూర్పుగంగవరం హోం జట్టుపై మాధవరం జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ గెలిచిన మాధవరం టీమ్‌ రూ.1 లక్ష, రన్నరప్‌గా నిలిచిన తూర్పుగంగవరం టీం రూ.75 వేలు, మూడో స్థానం నాగంబొట్లపాలెం జట్టు రూ.50 వేలు, నాల్గవ స్థానంలో తూర్పుగంగవరం జూనియర్‌ జట్టు నిలిచి రూ.25 వేలు కై వసం చేసుకున్నాయి. ప్రతిభ కనబరిచిన జట్లకు దాతలు సహకారంతో నగదు బహుమతితోపాటు కప్‌లను అందించారు.

యర్రగొండపాలెం: మండలంలోని వీరభద్రాపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు బత్తుల శ్రీను ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతోనే ఆ పార్టీలోని నాయకులు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని అన్నారు. తమ పార్టీ అధికారంలో లేకపోయినా జగనన్నపై ఉన్న అభిమానంతో టీడీపీ నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపు మక్కువ చూపుతున్నారని చెప్పారు. పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుండటం వలన వారే తమ ప్రాంతంలో నాయకత్వం వహిస్తూ ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు మందుల ఆదిశేషు, వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, ఎం.బాలగురవయ్య, సయ్యద్‌ జబీవుల్లా, వి.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement