● కనిగిరి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 8 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి
● వేలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్నా 4,602 కేజీలు మాత్రమే కొనుగోలు
కనిగిరి పొగాకు వేలం కేంద్రం పరిధిలో గత వారంలో బేళ్ల తిరస్కరణలు ఇలా ఉన్నాయి..
కనిగిరి రూరల్:
చంద్రబాబు ప్రభుత్వ పాలనలో పొగాకు రైతులు కుదేలయ్యారు. కనిగిరి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీంతో రైతు సంఘాల నాయకులు నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు. కనిగిరి వేలం కేంద్రం పరిధిలో పొగాకు సాగు విస్తీర్ణం 4,952 హెక్టార్లు కాగా, 5 క్లస్టర్ల పరిధిలో 74 గ్రామాల్లో 1,245 బ్యారన్‌లు ఉన్నాయి. గతేడాది పొగాకు ఉత్పత్తి 8.5 మిలియన్ కేజీలు కాగా, ఈ ఏడాది 8 మిలియన్ కేజీల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. వేలం కేంద్రం ప్రారంభమై 29 రోజులు కావస్తున్నా నేటికీ 4,602 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
బేళ్ల తిరస్కరణలతోనే సరి...
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా పొగాకు రైతుల సమస్యలపై దృష్టి సారించకపోవడంతో పొగాకు కంపెనీల ప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి బ్యారన్ నుంచి 12 బేళ్ల వరకు అనుమతి ఉన్నా.. ఇప్పటి వరకు మూడునాలుగు సార్లు వేలానికి వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. పొగాకు రైతు గ్రేడ్ నంబర్ (ఎఫ్ 1, ఎఫ్ 2, ఎఫ్ 3), పచ్చా, మీడియం, లో గ్రేడ్ నాలుగు రకాలను వేలం కేంద్రానికి తీసుకెళ్తుండగా, కేవలం గ్రేడ్ 1 (ఎఫ్ 1, ఎఫ్ 2, ఎఫ్ 3) రకాల పొగాకు మాత్రమే కొనుగోలు చేసి మిగతా వాటిని తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రతిసారీ వేలం కేంద్రానికి పొగాకు బేళ్లు తీసుకురావడం.. తక్కువ బేళ్లను మాత్రమే కొనుగోలు చేయడంతో మిగతా వాటిని తీసుకుని ఉసూరుమంటూ తిరిగి ఇంటికి వెళ్లడం రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
అధిక ధరలు...
రెండేళ్ల క్రితం కనిగిరి పొగాకు వేలం పరిధిలో 7.58 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చింది. దాదాపు రైతు దగ్గర ఉన్న పొగాకు మొత్తాన్ని అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కొనుగోలు చేయించింది. గత ప్రభుత్వంలో కేజీ గరిష్ట ధర రూ.350 నుంచి రూ.360 వరకు, కనిష్ట ధర రూ.280 నుంచి రూ.270 వరకు వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల నుంచి ఆ పరిస్థితి లేదు. గతేడాది కేజీ గరిష్ట ధర రూ.280 పలకగా, ఈ ఏడాది మరీ రూ.250కు దిగజారింది. అంతేగాకుండా మీడియం, లో గ్రేడ్ పొగాకు బేళ్లను కొనుగోలు చేయకపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఇళ్లలో పేరుకుపోయిన పొగాకు బేళ్లను చూసుకుంటూ.. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో లోలోన కుమిలిపోతున్నారు.
వారం
తిరస్కరించిన బేళ్లు
వేలానికి
తెచ్చిన బేళ్లు
సోమవారం 264 75
మంగళవారం 254 115
బుధవారం 219 82
గురువారం 255 149
శుక్రవారం 105 50
శనివారం 254 99
నో బిడ్‌లతో అల్లాడుతున్న పొగాకు రైతులు
తిరస్కరించే పనిలోనే నిమగ్నమవుతున్న కంపెనీల ప్రతినిధులు
ఎక్కడి పొగాకు అక్కడే ఉండటంతో
ఆందోళనలు
నేడు నిరసన కార్యక్రమానికి
పిలుపునిచ్చిన రైతు సంఘాలు


