రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సైకిలిస్ట్‌ను ఢీకొన్న ద్విచక్రవాహనం

అద్దంకి: ౖబెక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో భార్యా భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణంలోని భవానీ సెంటర్‌లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..ముండ్లమూరు మండలం మారెళ్లకు చెందిన రామాంజనేయులు, అతని భార్య బైకుపై పనిమీద గుంటూరు వెళుతున్నారు. ఈ క్రమంలో వారి బైకు పట్టణంలోని భవానీ సెంటర్‌కు చేరుకోగానే లారీ ఢీకొట్టడంతో రామాంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రున్ని తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరువాత ఒంగోలు వైద్యశాలకు తరలించారు.

మార్కాపురం రూరల్‌: మండలంలోని వేములకోట పంచాయతీ పరిధిలోని కొట్టాలపల్లిలో అదివారం విషాధ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చెవుల వీరయ్య (58)తన ఇంటి సమీపంలో ఒంటిపై గాయాలతో మృతి చెందాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వేమన తెలిపారు.

మార్టూరు: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతిచెందిన సంఘటన మార్టూరులో ఆదివారం వెలుగు చూసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన హరిచందన్‌ ప్రధాన్‌, జయంతి (28) అనే ఇద్దరు సీ్త్రపురుషులు భార్యాభర్తలుగా చెప్పుకుని గత నెలలో స్థానిక జాతీయ రహదారి సమీపంలోని ఓ నూలు మిల్లులో కార్మికులుగా చేరారు. శనివారం రాత్రి తమ క్వార్టర్స్‌లోని ఇంటి సీలింగ్‌ ఫ్యాన్‌కు జయంతి ఉరి వేసుకుని మృతి చెందిందంటూ హరిచందన్‌ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఆదివారం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. జయంతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా హరిచందన్‌ ప్రధాన్‌కు గతంలో వివాహమై భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, మృతురాలికి కూడా గతంలో వివాహమై భర్త, నలుగురు పిల్లలు ఉన్నారని సమాచారం. వీరిద్దరూ మాత్రమే గత నెలలో ఇక్కడికి వచ్చి కార్మికులుగా చేరారు. హరిచందన్‌ ప్రధాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

వేటపాలెం: రోడ్డుపై ఆగి ఉన్న మోటార్‌ బైకును వెనుక నుంచి వచ్చి మరో మోటార్‌ బైకు ఢీకొన్న సంఘటనలో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి మృతి చెందాడు. అక్కాయిపాలెం పంచాయతీలో బైపాస్‌ రోడ్డు జంక్షన్‌ దగ్గరలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చీరాల వైపు నుంచి ఎస్‌.శ్రీనివాసరావు (50) తన స్నేహితుడి మోటార్‌ బైకుపై వెనుక కూర్చుని వేటపాలెం వైపు వస్తున్నాడు. అక్కాయిపాలెం వద్దకు వచ్చేసరికి రోడ్డుపై నిలిపి ఉన్న మరో బైకును వెనుక నుంచి ఢీకొట్టారు. బైకు వెనుక కూర్చున్న శ్రీనివాసరావు రోడ్డుపై పడి తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడు పర్చూరు కోర్టులో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేటపాలెం: సైకిల్‌పై వెళుతున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొనడంతో సైకిల్‌పై ఉన్న వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్ళపల్లి సమీపంలోని 216 జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ధోనిపూడి రమేష్‌ (45) రొయ్యల చెరువుల వద్ద కూలి పనులు చేస్తుంటాడు. ఆదివారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో పందిళ్ళపల్లి సమీపంలోని హెచ్‌పీ పెట్రోలు బంకు సమీపంలోని 216 జాతీయ రహదారిపై వెళుతుండగా వెనుక నుంచి గ్లామర్‌ ద్విచక్రవాహనం ఢీకొనడంతో రమేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. అలానే ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి కూడా కింద పడటంతో అతని కాలుకు తీవ్రగాయమైంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్‌ఐ జనార్దన్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేశారు. మృతుడు ధోనిపూడి రమేష్‌ పొట్టి సుబ్బయ్యపాలెం వాసి కాగా ప్రస్తుతం కుమార్తె లక్ష్మి వద్ద ఉంటున్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement