ఉలవపాడు: మండల పరిధిలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..భీమవరం ఎస్టీ కాలనీలో జరుగుతున్న అంకమ్మ కొలుపులకు సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన చేవూరి జాలయ్య (53) ద్విచక్రవాహనం పై వస్తూ భీమవరం సమీపంలో విద్యుత్‌స్తంభానికి ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మామిడి కాయలు కొనుగోలు చేయడానికి ఆగి.....
మండల పరిధిలోని వీరేపల్లి గ్రామం వద్ద జాతీయరహదారిపై మామిడి కాయలు కొనుగోలు చేయడానికి వచ్చి ఆగి రోడ్డు దాటుతూ కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేలూరుపాడు గ్రామానికి చెందిన 30 మంది వేళంగిణికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళుతున్నారు. వీరేపల్లి వద్ద మామిడి కాయలు కొనుగోలు చేయడానికి బస్సును ఆపారు. బస్సులో నుంచి అమర్లపూడి ఏసుపాదాలు (64) దిగి బయట రోడ్డు మీద నడుస్తున్న సమయంలో కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఏసుపాదాలు అక్కడికక్కడే మృతి చెందాడు. టూర్ కు వెళ్లి వస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో తోటిగ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
మరొకరికి గాయాలు
తిరుమలకు నడిచి వెళ్తుండగా...
తిరుమలకు నడిచి వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీ కొన్న సంఘటన జాతీయరహదారి పై వీరేపల్లి వద్ద ఆదివారం జరిగింది. అద్దంకి మండలం వి.కొప్పెరపాడుకు చెందిన నాగరాజు తన మిత్రులతో కలసి తిరుమలకు కాలి నడకన నడిచి వెళుతున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారు ఢీ కొనడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


