దొంగస్వామి నుంచి భూములు తిరిగి తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దొంగస్వామి నుంచి భూములు తిరిగి తీసుకోవాలి

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

దొంగస్వామి నుంచి భూములు తిరిగి తీసుకోవాలి

ఒంగోలు వన్‌టౌన్‌: గత 24 సంవత్సరాల నుంచి గుడ్లూరు మండలం చేవూరులో దొంగస్వామిని రక్షిస్తున్న జిల్లా అధికారులపై విచారణ జరపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘ అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య పాల్గొని మాట్లాడారు. 2002లో అప్పటి అటవీ శాఖామంత్రి అయ్యన్న పాత్రుడు నెల్లూరు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద కట్టడాలు, దేవుళ్లు, రాక్షసుల బొమ్మలు చూసి ఇదేమిటని లోపలికి వెళ్లి పరిశీలించారని గుర్తుచేశారు. ఆక్రమించిన భూమిలో దొంగస్వామి ఆ నిర్మాణాలు చేశాడని మంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారన్నారు. ఆ విషయంపై విచారణ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ 24 సంవత్సరాలుగా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. ఒక పేదవాడు నివసించటానికి ప్రభుత్వ భూమిలో చిన్న గుడిసె వేసుకుంటే మరుక్షణమే కూల్చివేసే అధికారులు.. ఒక దొంగస్వామి చేవూరు సాగుచెరువు, అటవీ భూములు ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తుంటే ఇంతవరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. అటవీ భూమిలో అనాథ పిల్లల స్కూలు అని 7–4–2007న 37వ నంబర్‌తో జీవో తెచ్చుకుని ఆ జీవోలోని నిబంధనలకు వ్యతిరేకంగా యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఎవరైనా తనిఖీకి వచ్చినప్పుడు ప్రలోభపెట్టి తనకు అనుకూలంగా రిపోర్టు రాయించుకుంటున్నాడన్నారు. 2000 సంవత్సరంలో సర్వే నంబర్‌ 879లోని 36 ఎకరాల చెరువు పోరంబోకు భూమిని తనదే అంటూ, ఇతరులెవరికీ హక్కు లేదంటూ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రామదూత ఆశ్రమం పేరుతో రిజిస్టర్‌ చేయించుకున్నాడన్నారు. ఇటువంటి మోసగాడిని అరెస్ట్‌ చేసి జైల్లో వెయ్యాల్సిన అధికారులు.. ఆ పని చేయకుండా దొంగ స్వామికి వత్తాసు పలుకుతున్నారన్నారు. ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోకుండా ఏదోక రేటుకు అతనికే అమ్ముదామనే ఆలోచన కలెక్టర్‌కు రావడం ఏమిటని వెంకటసుబ్బయ్య ప్రశ్నించారు. హేతువాద సంఘం చేసిన పోరాట ఫలితంగా 2021లో ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిశీలించి మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి కలెక్టర్‌ పెట్టిన అమ్మకాన్ని రద్దు చేసి తక్షణమే స్వాధీనం చేసుకోండి అని ఆదేశించారన్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. ఆ తర్వాత కూడా 2024లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ రెండోసారి అమ్మకానికి పెట్టారన్నారు. ఏ జీవో ప్రకారం అమ్మకానికి పెట్టడం జరిగిందో బహిరంగపరచాలన్నారు. 24 సంవత్సరాలుగా ఆక్రమణదారులను తన్ని తరిమివేయకుండా కాపాడిన జిల్లా అధికారులపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర హేతువాద సంఘ అధ్యక్షుడు ఎంకే బేగ్‌, సీపీఐ నాయకుడు ఉప్పుటూరి ప్రకాశరావు, పౌర సమాజం అధ్యక్షుడు గుమ్మళ్ల నరసింహారావు, హేతువాద సంఘ సభ్యులు రంగారెడ్డి, నజీర్‌ బాషా, సుభాని, సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, ఏపీసీఎల్‌సీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్లూరి కాంతి, అద్దంకి వీరాంజనేయులు, హేతువాద సంఘ రాష్ట్ర నాయకుడు సిఖా చంద్రశేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.

24 ఏళ్లుగా చేవూరు దొంగస్వామిని

రక్షిస్తున్న జిల్లా అధికారులపై విచారణ జరపాలి

ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement