కంభం: మండలంలోని తురిమెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975–76 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి కర్నూలు ప్రభుత్వజూనియర్ కళాశాల విశ్రాంత అధ్యాపకుడు బీవీ మధుసూధనరావు అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విద్యా బోధన కేవలం పాఠ్యాంశాలకు, డిగ్రీ పట్టాలకు, సర్టిఫికెట్లకు పరిమితం కాకుండా జ్ఞాన – విజ్ఞాన సహితంగా విద్యాబోధన జరిగితే జీవితంలో ఉన్నత స్థానంలో రాణిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు విద్యార్థి దశలో జరిగిన మధురమైన అనుభూతులను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, పూర్వ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు రమణయ్య, లింగం వెంకటేశ్వర్లు, శిరిగిరి రమేష్, పూర్ణ చంద్రరావు, బెల్లంకొండ సాయిబాబు, గోవిందయ్య, బాలచెన్నమ్మ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.
సింగరాయకొండ: విద్యుదాఘాతానికి పాకల–2 గ్రామ సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్ పోట్లూరి శేషాద్రి(42) మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం పాకల బస్టాండ్ సెంటర్‌లోని కుంట వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా శేషాద్రి బస్టాండ్ సెంటర్‌లోని కుంట వద్ద ఉన్న ట్రాన్స్‌ఫారం వద్ద ఇతర సిబ్బంది తో కలిసి మరమ్మతులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శేషాద్రి విద్యుత్ స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విగతజీవిగా మారిపోయాడు. అయితే విద్యుత్ శాఖాధికారులు మాత్రంఅన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, విద్యుత్ సరఫరాకు అవకాశం లేదని చెబుతున్నారు. మృతదేహాన్ని విద్యుత్ స్తంభం పై నుంచి కిందకు దించేందుకు విద్యుత్ శాఖాధికారులు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. మృతునికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీహరి తెలిపారు.


