ఒంగోలు టౌన్: రాష్ట్రంలోని యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా వైఫల్యం చెందారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆర్.కరుణానిధి విమర్శించారు. జూన్ 1వ తేదీ నుంచి పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరిగే విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం మల్లయ్యలింగం భవనంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కరుణానిధి మాట్లాడుతూ నలభై సంవత్సరాల రాజకీయ, పాలనా అనుభవం ఉందని చెప్పుకునే బాబు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఎందుకు నెరవేర్చలేక పోయారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో బాబు ష్యూరిటీ– జాబు గ్యారంటీ అని నినాదాలు ఇప్పుడేం పోయాయోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ, గ్రూప్స్, పోలీసు, రెవెన్యూ, హెల్త్, విద్యుత్ తదితర శాఖలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం యువతను దగా చేయడమేనని ధ్వజమెత్తారు. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం యువత ఆతృతగా ఎదురుచూస్తుందన్నారు. బడా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న బాబు ప్రభుత్వం యువతకు మాత్రం ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తుందని మండిపడ్డారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల ద్వారా యువతను చౌక కార్మికులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాక, చేయడానికి చేతిలో పనులు లేక గ్రామీణ యువత వలస వెళుతోందని, పల్లెల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని విస్మరించడం తగదని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా కోటప్పకొండలో జరుగుతున్న శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన సమాఖ్య నాయకులు నాగరాజు, కట్టా ఆంజనేయులు, స్టాలిన్, ఆదర్ష్, మరియబాబు, ఏవీఎస్ చౌదరి, గోపీ పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని నిరుద్యోగాంధ్రప్రదేశ్‌గా మార్చిన కూటమి పాలకులు
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కరుణానిధి ధ్వజం


