అడ్డేలేదయ్యా..! | - | Sakshi
Sakshi News home page

అడ్డేలేదయ్యా..!

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

మట్టి మాఫియా..

ఇరిగేషన్‌ చెరువులే లక్ష్యంగా భారీగా తవ్వకాలు అనుమతులు లేకుండా ఇష్టారీతిన చెరువులను తవ్వేస్తున్న వైనం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కావలి ప్రాంతానికి భారీగా మట్టి తరలింపు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ఇరిగేషన్‌శాఖ అధికారులు

మట్టి మాఫియా చెలరేగిపోతోంది. చెరువులను ఇష్టానుసారం తవ్వేస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో చెరువులను చెరబడుతోంది. రాత్రింబవళ్లు చెరువులను తవ్వేసి మట్టిని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. సాగునీటి చెరువులు గుల్లవుతున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ భూములకు ఈ మట్టిని తరలించేస్తున్నారు. చెరువుల్లో మట్టిని తవ్వి ప్లాట్లకు తరలిస్తున్నా మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మట్టి మాఫియా..

వీరేపల్లి చెరువులో సాగుతున్న మట్టి తవ్వకాలు

కందుకూరు: నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ప్రధానంగా గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని సాగునీటి చెరువులను ఆసరాగా చేసుకుని మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మండలాల్లో కావలి, కందుకూరు నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉన్న గ్రామాల చెరువుల్లో మట్టి తవ్వి తరలించేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన వెలుస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకి, కావలి ప్రాంతానికి ఇక్కడి నుంచే మట్టిని తరలిస్తున్నారని తెలుస్తోంది. రెండు రోజుల కిందట నర్సాపురం కుంటి చెరువు నుంచి పక్కనే ఉన్న ఓ రియల్‌ వెంచర్‌ 5 వేల ట్రిప్పుల మట్టిని తరలించారని తెలుస్తోంది. అలాగే వీరేపల్లి చెరువు నుంచి శనివారం భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేశారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారి 167బి పక్కన కందుకూరు, సింగరాయకొండ మధ్యలో కొత్తగా పుట్టుకొచ్చిన వెంచర్లకు చెరువులు, కుంటల నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. పట్టపగలే బహిరంగంగానే జేసీబీలు ఏర్పాటు చేసి ఇష్టారీతిన మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఈ మట్టి మాఫియా వెనకాల అధికార పార్టీకి చెందిన కీలక నేత హస్తం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన అనుమతితోనే మట్టి మాఫియా చెలరేగిపోతుందని తెలుస్తోంది. అదే సందర్భంలో చెరువుల్లో సాగుతున్న మట్టి తవ్వకాల గురించి స్థానిక ఇరిగేషన్‌శాఖ అధికారులకు తెలియనిది కాదు. ఈ మాఫియాకు ఆశాఖ ఉన్నతాధికారి మద్దతు ఉందనేది బహిరంగ రహస్యమే. అధికార పార్టీ కీలక నేత ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఈ అధికారి చెరువుల్లో సాగుతున్న తవ్వకాల గురించి ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సాపురం వద్ద ఉన్న కుంటి చెరువుల్లో మట్టి తవ్వకాల గురించి ఈ అధికారికి ముందే తెలిసినా ఆ వైపు కన్నెత్తి చూడకుండా మిగిలిన సిబ్బందిని కూడా అడ్డుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే పలుమార్లు మెమోలు అందుకున్న ఈ అధికారి తీరులో మాత్రం ఏమాత్రం మార్పు రావడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు అంటే తనకు లెక్కేలేదన్నట్లు సదరు అధికారి వ్యవహార శైలి ఉంది. దీంతో మట్టి మాఫియాకి నియోజకవర్గంలో ఎదురేలేకుండా పోతోంది. ఫలితంగా ఇరిగేషన్‌ చెరువుల భద్రత ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే మట్టిమాఫియా ఇచ్చే కమీషన్‌లకు అలవాటు పడ్డ స్థానిక అధికారులు చెరువుల భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement