మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని కేఆర్ గ్రౌండ్ ఫంక్షన్ హాలులో అండర్ 13 రాష్ట్ర స్థాయి బాలుర, బాలికల చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 146 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు చెస్ ప్రతినిధి పీసీహెచ్ బసవేశ్వరరావు, చీఫ్ ఆర్బిటర్ జీవీకుమార్ తెలిపారు. ఈ పోటీలు 23, 24 తేదీల్లో జరుగుతున్నాయని, విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో చక్కా రామగోపాల్, చెన్నయ్య, వీరయ్య, ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీహెచ్‌వీ రామకృష్ణ
ఒంగోలు: బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరం అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి సీహెచ్‌వీ రామకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం మతపెద్దలతో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై న్యాయమూర్తి అవగాహన కల్పించారు. బాల్య వివాహాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నా, వాటికి సహకరించినా, వాటి నిర్వహణ చేసినా చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. తప్పు తెలిసి చేసినా, తెలియక చేసినా చట్ట ప్రకారం శిక్షార్హులే అని, ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. తద్వారా సమాజంలో చట్టపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా బాల్య వివాహాలు నమోదవుతున్నాయని, ఈ విషయం పట్ల అధికారులు, ప్రజలు, మతపెద్దలు అవగాహన కలిగి ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు రాంబాబు, శ్రీధర్, ముస్లిం మతపెద్దలు ఖాదర్‌బాషా, క్రైస్తవ మతపెద్దలు జెర్మియా తదితరులు పాల్గొన్నారు.
● రైతు సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు
మార్కాపురం:
వెలిగొండ ప్రాజెక్టు నీటిని వచ్చేనెల చివరి నాటికి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రైతు సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు డిమాండ్ చేశారు. రైతు సంఘ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టును ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధిపొందుతున్నారే కానీ, ప్రాజెక్టు పూర్తిచేసి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. నిర్వాసితుల నష్టపరిహారం, మిగిలిన కాలువల పనులు పూర్తికావాలంటే ఇంకా రూ.3500 కోట్లు ఖర్చుచేయాల్సి ఉండగా, జూన్ నెలలో ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని చెప్పడం మరొకసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్లేనని అన్నారు.
మార్కాపురం జిల్లా
నూతన కమిటీ ఎన్నిక..
రైతు సంఘ మార్కాపురం జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా డీ తిరుపతిరెడ్డి, ఊసా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులుగా పీ తిప్పారెడ్డి, గాలి వెంకట రామిరెడ్డిలను ఎన్నుకున్నట్లు సహాయ కార్యదర్శిగా ఎన్నికై న డీ సోమయ్య తెలిపారు.


