● నగరంలోని వీధులు ఊడ్చిన
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్:
పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని కలెక్టర్, ఒంగోలు నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. శ్రీఆపరేషన్ క్లీన్ స్వీప్‌శ్రీ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఒక రాష్ట్రం–ఒక పరిశుభ్రత లక్ష్యం కార్యక్రమంలో భాగంగా శనివారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన మున్సిపాలిటీ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కలెక్టర్ పి.రాజాబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ వరకు చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురు పట్టి పారిశుధ్య పనులు చేపట్టారు. నెల్లూరు బస్టాండ్ వద్ద తాటి ముంజలు అమ్ముకునే వారితో, తోపుడు బండిపై రాగి జావ అమ్ముకునే వారితో, ప్రజలతో కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని మే 23వ తేదీ నుంచి నాలుగు వారాలపాటు అమలు చేస్తారని, మొదటి వారంలో నగరంలోని చెత్త ఎక్కువగా పేరుకుపోయే రెడ్ స్పాట్లు (ఎక్కువగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు), యెల్లో స్పాట్లు (పాక్షికంగా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు) పూర్తిగా తొలగించడంపై దృష్టి సారిస్తారన్నారు. రెండవ వారంలో కాలువలు, డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రపరిచి, నీటి నిల్వలు, వరద సమస్యలను నివారించడానికి చర్యలు తీసుకోవడం, మూడవ వారంలో నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, నాల్గవ వారంలో పబ్లిక్ టాయిలెట్స్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రజా ప్రదేశాలను శుభ్రపరచడం ద్వారా హైజీన్ ప్రమాణాలను పెంచడం వంటి కార్యక్రమాలు చేపడతారన్నారు. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట క్రిష్ణయ్య, ఒంగోలు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.


