ఇద్దరు దొంగలకు సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు దొంగలకు సంకెళ్లు

May 24 2026 1:39 AM | Updated on May 24 2026 1:39 AM

ఒంగోలు టౌన్‌: చీమకుర్తి పట్టణంలోని ఒక హార్డ్‌వేర్‌ దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా పోలీసులు సంకెళ్లు వేశారు. నిందితుల నుంచి భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ హర్షవర్థన్‌రాజు వివరాలు వెల్లడించారు. ఎస్పీ కథనం ప్రకారం.. చీమకుర్తి పట్టణం కొత్తపేట బజార్‌లో నివశించే అద్దేపల్లి నగేష్‌బాబు ఏడాదిన్నరగా ఇసుకవాగు సెంటర్లో శ్రీ వెంకటేశ్వర హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు ఎప్పటిలాగే దుకాణానికి వెళ్లిన నగేష్‌ లోపల రెండో గది ఉన్న చెక్క తలపులకు తాళం వేసే ఇనుప గడియ తొలిగించి ఉండటం కనిపించింది. అనుమానం వచ్చి చూడగా గదిలోని రెండు బీరువాల్లో దాచి ఉంచిన బంగారం, వెండి, నగదు దొంగతనానికి గురైనట్లు గుర్తించాడు. వెంటనే చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం సహకారంతో సాక్ష్యాధారాలు సేకరించారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేశారు. నేరస్థలంలో సేకరించిన ఆధారాలతో నెల్లూరు జిల్లా సీతారాంపురం గ్రామానికి చెందిన మిరపల్లి ప్రసాద్‌ అలియాస్‌ గురవయ్య చోరీకి పాల్పడినట్లు నిర్థారణకు వచ్చారు. ఇతడు భవనాలపైకి సులువుగా ఎక్కి రూఫ్‌ టాప్ల ద్వారా దుకాణాలు, ఇళ్లల్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడంలో దిట్ట. ఇతడు నెల్లూరు జిల్లా సీతారాంపురం, ప్రకాశం జిల్లా టంగుటూరు, కందుకూరు, పొదిలి, కనిగిరి, శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చీమకుర్తి సీఐ డి.ప్రసాద్‌, చీమకుర్తి, మద్దిపాడు, కొత్తపట్నం, ఒంగోలు తాలుకా, సంతనూతలపాడు ఎస్సైలు ఎల్‌.సంపత్‌కుమార్‌, జి.వెంకటసూర్య, యూ.సుధాకర్‌, ఎం.సుదర్శన్‌, అజయ్‌బాబులు బృందంగా ఏర్పడ్డారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం కనిగిరి మండలం నందిమారెళ్ల శివాలయం వద్ద పామూరు వైపు నుంచి వస్తున్న ప్రసాద్‌, గుంటూరు జిల్లా పెద్ద పలుకలూరు గ్రామానికి చెందిన కుంభా సాంబయ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 34 సవర్ల బంగారం, సుమారు 2 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. పామూరులోని పీడీసీసీ బ్యాంకు, దుత్తలూరులోని ఎస్బీఐల్లో ప్రసాద్‌ డిపాజిట్‌ చేసిన నగదు 5.95 లక్షల రుపాయలను మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన పది రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ హర్షవర్థన్‌రాజు అభినందించారు.

చోరీ చేసిన పది రోజుల్లోనే పట్టుకున్న ఖాకీలు

ప్రధాన నిందితుడిపై 13 చోరీ కేసులు

నిందితుల నుంచి రూ.37 లక్షల

సొత్తు స్వాధీనం

చోరీ వివరాలు వెల్లడించిన

ఎస్పీ హర్షవర్థన్‌రాజు

Advertisement
 
Advertisement
Advertisement