మరోవైపు వాన | - | Sakshi
Sakshi News home page

మరోవైపు వాన

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

ఉమ్మడి జిల్లాలో భిన్న వాతావరణం 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు పశ్చిమ ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వాన పెనుగాలులకు నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు గాలివానకు గోడకూలి ఒకరు మృతి

ఓ వైపు ఎండ..

నాగంపల్లి పొలాల్లో దెబ్బతిన్న ట్రాన్స్‌ఫాం, విరిగిన స్తంభం

చీమకుర్తి బైపాస్‌లో చెట్లు విరిగి అడ్డంగా పడిన వాటిని తొలగిస్తున్న దృశ్యాలు

ఒంగోలు సబర్బన్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భిన్న వాతావరణం నెలకొంది. ఒక పక్క సూర్యుడు సుర్రుమంటే మరో పక్క ఈదురుగాలులతో వాన కురిసింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కనిగిరిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. త్రిపురాంతకంలో 40.7, బల్లికురవలో 40.5 డిగ్రీలు నమోదైంది. మార్కాపురం జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడి రెండు, మూడు రోజులుగా భగ్గుమన్న భానుడు ఒక్క రోజు కాస్త ఊరట కలిగించాడు. ఒంగోలు నగరంలో మధ్యాహ్నం కాసేపు చిరుజల్లులు పడివాతావరణం చల్లబడింది.

ఈదురు గాలులతో భారీ వర్షం

గిద్దలూరు రూరల్‌: ఉరుములు, మెరుపులతో ఈదురు గాలుల భారీ వర్షం కారణంగా మండలంలోని ఉయ్యాలవాడ, సూరేపల్లె, లింగాపురం గ్రామాల్లో 6 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వాతావరణంలో ఒక్కసారిగా మారి శుక్రవారం వేకువ జామున ఉరుములు మెరుపులతో భారీ వర్షం మండలంలో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి ఆయా గ్రామాల్లో వ్యవసాయ బోర్లకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ముండ్లపాడు ఏఈ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యుత్‌శాఖ సిబ్బంది మరమ్మతులు చేసి గృహాలకు విద్యుత్‌ సరఫరా అందించారు. పిడుగుపాటుకు మండలంలోని కె.ఎస్‌.పల్లెలో కొబ్బరి చెట్టు ధ్వంసమైంది. భారీ వర్షంతో పట్టణంలోని రాజానగర్‌, శ్రీరామ్‌నగర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ రోడ్డు, కశెట్టివారివీధి, డీఆర్‌ఆర్‌ ప్లాజా వైపు వీధులు జలమయమై ప్రజల రాకపోకలు ఇబ్బందిగా మారాయి. డ్రైనేజి కాలువల్లో నుంచి మురుగు నీరు రోడ్లు మీదకు వచ్చి చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

గాలివాన బీభత్సం

బేస్తవారిపేట: మండలంలో గురువారం అర్ధరాత్రి ఉరుములు–మెరుపులతో గాలివాన కురిసింది. గలిజేరుగుళ్లలోని రామాలయం గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం విరిగిపడిపోయింది. శింగరపల్లెలో ఒకటి, జెన్నివారిపల్లెలో మూడు, ఖాజీపురంలో ఒక విద్యుత్‌ స్తంభం ఈదురుగాలులకు విరిగిపోయాయి. దీంతో పొలాల్లోని మోటార్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పొలాల్లో ఆరబెట్టుకున్న మొక్కజొన్న కంకులు వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.

ఉరుములు, మెరుపులు..ఈదురు గాలులు..

కొనకనమిట్ల: మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి విపరీతమైన ఈదురు గాలులతో ఓ మోస్తారు వర్షం పడింది. ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా నాగంపల్లి, వింజవర్తిపాడు, గొట్లగట్టు, కాట్రగుంట, మర్రిపాలెం, వాగుమడుగు, పెదారికట్ల, గొంటువానిపల్లి గ్రామాల్లో కనిపించింది. ఆయా గ్రామాల్లో 50కి పైగా విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి పడినట్లు విద్యుత్‌ అధికారులు వెల్లడించారు. నాగంపల్లిలో వింజవర్తిపాడు ప్లీడర్‌కు సంబంధించి ట్రాన్స్‌ఫాం దెబ్బతినటంతో పాటు విద్యుత్‌ స్తంభం పడిపోయింది. నాగంపల్లి ఎస్సీ కాలనీలో ఎక్కువగా స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గొట్లగట్టు, మర్రిపాలెం, పెదారికట్ల గ్రామాల్లో పొలాల్లో స్తంభాలు పడిపోయాయి. నాగంపల్లి, వింజవర్తిపాడు గ్రామాల్లో ఓ మోస్తారు వర్షం పడింది. పలు చోట్ల అరటి, బొప్పాయి తోటలకు ఈదురు గాలులతో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. పడిపోయిన విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌ శాఖ ఏఈ బ్రహ్మం చెప్పారు. కాట్రగుంట పంచాయతీ ఓబులరెడ్డిపల్లిలో గురువారం అర్థరాత్రి, శుక్రవారం తెల్లవారు జామున వీచిన ఈదురు గాలుల బీభత్సానికి గ్రామానికి చెందిన రాజాల లక్ష్మిరెడ్డి ఇటీవల రూ.5 లక్షలతో గొర్రెల షెడ్‌ నిర్మించాడు. అయితే ఈదురు గాలులకు షెడ్‌కు ఏర్పాటు చేసిన సిమెంటు రేకులు లేచి ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పొలాల్లో పడిపోయాయి. దీంతో పాటు పొలాల్లోని కరెంటు స్తంభాలు విరిగిపడటంతో తీగలు తెగిపడ్డాయి. వీఆర్‌ఓ రమేష్‌ జరిగిన నష్టం అంచనా వేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు.

గోడకూలి ఒకరు మృతి

పీసీపల్లి: గాలివానకు గోడకూలి ఒకరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి మండలంలోని శంకరాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంధం ప్రసాదు (34) వర్షం సుడి గాలులకు గొర్రెలను ఇంటికి తోలుకొని వస్తుండగా గాలివాన బాగా వీస్తుండంతో డెయిరీ ఫాం గోడ పక్కన నిలుచున్నాడు. గాలివానకు గోడ అతని మీద కూలింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో బంధువులు వెతుకుతూ అతని మీద గోడ పడినట్లు గుర్తించి హుటాహుటిన ప్రైవేటు వాహనంలో పీసీపల్లి వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి 108 లో కనిగిరి ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలోనే రెండుసార్లు గోడ కూలిందని డెయిరీ ఫాం యజమాని మాచినేని రవికిరణ్‌ చౌదరి ఫాం కోసం బరువు లేని బ్రిక్‌ రాళ్లతో గోడ నిర్మించారు. ఆ గోడ గాలికి కూలి దాని కింద పడి ప్రసాదు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. మృతునికి ముగ్గురు పిల్లలు, భార్య సంగీత ఉన్నారు.

చీమకుర్తి బైపాస్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు

చీమకుర్తి: గురువారం అర్ధరాత్రి చీమకుర్తిలో వీచిన బలమైన గాలులు, వర్షానికి బైపాస్‌లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. కొన్ని చెట్లు వాహనదారులపై కూడా పడి స్వల్ప ప్రమాదాలతో బయటపడ్డారు. చీమకుర్తి మెయిన్‌రోడ్డులో కట్టిన ఫ్లెక్సీలు ఊడి రోడ్డు మీద పడటంతో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారింది. ఒంగోలు నుంచి చీమకుర్తి మీదుగా పొదిలి వైపు రాకపోకలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చీమకుర్తి మున్సిపల్‌ కమిషనర్‌ వై.రామకృష్ణయ్య తన సిబ్బందితో జేసీబీల సాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు, ఫ్లెక్సీలను తొలగించారు. బలమైన గాలువు, వర్షంతో పాటు ఉరుములు, మెరుపుల ధాటికి తెల్లవారుజాము వరకు కరెంటు కట్‌ చేయటంతో ఉక్కపోతలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement