ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఒంగోలుకు చెందిన కోమట్ల శ్రీనివాస స్వామిరెడ్డిని, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా సంతనూతలపాడుకు చెందిన జగన్నాథం కోటి లింగం (పూర్ణ)ను నియమించినట్లు తెలిపారు. అలాగే కొండపి నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ విభాగం ప్రెసిడెంట్‌గా కొండపికి చెందిన నూతలపాటి పోతులూరిని నియమించినట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని బీపీఎడ్, అండ్ డీపీఎడ్ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ డీవీఆర్. మూర్తి శుక్రవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు బీపీఎడ్ కోర్సుకు సంబంధించిన మొత్తం 976 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 96.93 ఉత్తీర్ణతా శాతంతో 946 మంది విద్యార్థులు పాసైనట్లు తెలిపారు. అలాగే డీపీఎడ్ కోర్సుకు సంబంధించి మొత్తం 154 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 96.10 ఉత్తీర్ణతా శాతంతో 148 మంది పాసైనట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎకనామిక్స్ డాక్టర్ ఎ.భారతిదేవి తెలిపారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు అభినందించారు. కార్యక్రమంలో డీన్ సీడీసీ డాక్టరు కేవీఎన్ రాజు, పీజీ పరీక్షల కోఆర్డినేటర్ ఆర్.శ్రీనివాసు పాల్గొన్నారు.
మార్కాపురం: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను పార్టీలకతీతంగా రైతులంతా ఏకమై అడ్డుకోవాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీ క్రిష్ణయ్య కోరారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన రైతు సంఘం మార్కాపురం జిల్లా మొదటి మహాసభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వామినాధన్ కమిషన్ అమలు చేయకపోవడంతో రాబోయే కాలంలో ఇప్పుడున్న రైతుల్లో పది శాతం కూడా మిగలకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడంతో రైతులు నష్టాల్లోకి వెళ్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు ఐకమత్యం అయితే ప్రభుత్వాలు దిగివస్తాయని చెప్పారు. ఢిల్లీలో వేలాది మంది రైతులు 13 నెలల పాటు ఆందోళన చేయడంతో మోదీ ప్రభుత్వం క్షమాపణ చెప్పిందన్నారు. స్వామినాధన్ కమిషన్ అమలుచేస్తే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరల కోసం కేంద్రం రూ.5 లక్షల కోట్ల నిధిని ఏర్పాటు చేయాలన్నారు. విత్తన చట్టాన్ని 2025లో మార్చారని, దీని వలన రైతులు నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే శనగలు, పత్తి, వర్జీనియా పొగాకు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారని తెలిపారు. సాగు చేసిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించి 30 ఏళ్లు గడిచినా ఎప్పటికి పూర్తవుతుందో తెలియదన్నారు. జిల్లాకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా అధ్యక్షుడు పీ వెంకటరావు, తిప్పారెడ్డి, ఊసా వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, సోమయ్య, రాజశేఖర్‌రెడ్డి, బాల నాగయ్య, వెంకటరావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.


