ఇవిగో నిధులు.. అవిగో నీళ్లు! | - | Sakshi
Sakshi News home page

ఇవిగో నిధులు.. అవిగో నీళ్లు!

May 23 2026 1:34 AM | Updated on May 23 2026 1:34 AM

మేదరమెట్ల:

క్కనే గుండ్లకమ్మ జలాశయం నిండుకుండలా ఉన్నా ఆ నీళ్లు తమ పొలాలకు మళ్లించే నాథుడు లేక మెట్ట ప్రాంత రైతులు కన్నీరు పెడుతున్నారు. పథకానికి శంకుస్థాపన చేసి పదిహేనేళ్లు దాటింది. కొరిశపాడులో యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలింది. అవిగో నీళ్లు.. ఇవిగో నిధులు..అంటూ మభ్యపెట్టడమే తప్ప క్షేత్రస్థాయిలో పథకం పనులు పూర్తి చేసి తమ గొంతు తడిపేవారు కరువయ్యారని కొరిశపాడు, నాగులుప్పలప్పాడు మండలాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశల పల్లకిలో అడియాశలు

దాదాపు 20 వేల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో గుండ్లకమ్మ నీటి ఆధారంగా ఆ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పథకం పనులు పడకేశాయి.

నష్టపరిహారం కూడా ఇవ్వని ప్రభుత్వం

ఎత్తిపోతల పథకం నిర్మాణంతో ముంపునకు గురైన కొరిశపాడులోని తూర్పుపాలెం గ్రామ నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్రామం మొత్తం ముంపునకు గురికావడంతో కొన్నేళ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా నష్టపరిహారంతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలిన తూర్పుపాలెం వాసులు కోరుతున్నారు.

హామీలు నీటి మూటలేనా?

ఇటీవల కలెక్టర్‌ రాజాబాబు, ఇతర అధికారులు ఆ పథకానికి సంబంధించిన కొరిశపాడు రిజర్యాయర్‌ను సందర్శించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ పథకం పూర్తి చేసేందుకు రూ.35 కోట్లు కేటాయించారని, రెండు, మూడు నెలల్లో పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ప్రకటించిన నిధులు విడుదల కాకపోవడం, కాంట్రాక్టర్‌లకు బకాయిలు చెల్లించక పోవడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. గడిచిన పదిహేనేళ్ల నుంచి ఎప్పటికప్పుడు ఈ సీజన్‌లో నీరు అందుబాటులోకి వస్తుందని, రెండు మండలాలకు చెందిన రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కపటి ప్రేమను వీడి తక్షణమే నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి ఈ ఏడాదికై నా గుండ్లకమ్మ జలాలు అందించేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

పడకేసిన యర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం

గుండ్లకమ్మ పారేదెన్నడు?

దశాబ్దానికిపైగా తీరని రైతుల వెతలు

తుప్పుపడుతున్న పైపులైన్లు

హామీలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement