ఒంగోలు: జాతీయస్థాయి అండర్–17 క్యాడెట్ ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారిణులు ఎంపికయ్యారని ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఇటీవల తణుకులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వ్యక్తిగత శాబర్ విభాగాలలో పుత్తూరు చక్రిక, అంకాల తన్వి పతకాలు కై వసం చేసుకుని జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్ పట్టణంలో నిర్వహించనున్న 21వ జాతీయస్థాయి ఫెన్సింగ్ క్యాడెట్ అండర్–17 విభాగం పోటీల్లో వారు పాల్గొంటారన్నారు. ఎంపికై న క్రీడాకారిణులను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు ఒంగోలులోని మినీ స్టేడియంలో శుక్రవారం అభినందించారు.
● గుండెపోటుతో రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి
తాళ్లూరు: చార్‌ధామ్ యాత్రకు వెళ్లి గుండెపోటుతో రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన వంగల మస్తాన్‌రెడ్డి (66) కుటుంబ సభ్యులతో వారం క్రితం చార్‌ధామ్ యాత్రకు వెళ్లారు. యమునోత్రికి రెండు కిలో మీటర్ల దూరంలో మస్తాన్‌రెడ్డి గుండెనొప్పితో కుప్పకూలారు. వెంటనే కుటుంబ సభ్యులు జానకీ చట్టీ అనే పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షలు చేసి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆయన భౌతిక కాయం శనివారం ఉదయానికి స్వగ్రామం తరలించి అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మస్తాన్‌రెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ పొందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, కుమారై ఉన్నారు.
సంతమాగులూరు (అద్దంకి): రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏల్చూరు సమీపంలోని నామ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రంలోని రాయచోటి నుంచి నరసరావుపేటకు ఓ టెంపో వెళ్తోంది. మండలంలోని ఏల్చూరు గ్రామ సమీపంలోని హైవేపై వాహనం నడుస్తుండగానే టైర్ పేలి పోవడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్‌లోకి దూసుకెళ్లి పడిపోయింది. ప్రమాద సమయంలో టెంపోలో 12 మంది ప్రయాణిస్తుండగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. అందులో ఒకరికి తీవ్ర గాయమైంది. క్షతగాత్రులను నామ్ అంబులెన్స్‌లో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఒంగోలు టౌన్: రైల్వేస్టేషన్ సమీప రైల్వే క్వార్టర్స్ వద్ద గురువారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గమనించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సుమారు 30 ఏళ్లు ఉంటాయి. మృతుడి సమాచారం తెలిసిన వారు 91211 04778, 90004 26018 నంబర్లకు ఫోన్ చేయాలని ఎస్సై ఎస్వీ రమణ కోరారు.


