న్యూస్‌రీల్
ఆబ్కారీ శాఖ మామూళ్ల మత్తులో జోగుతోంది. నిబంధనలు తుంగలోకి తొక్కి కాసులవేటలో పడింది. ప్రభుత్వాదాయాన్ని పెంచాల్సిన బాధ్యతను పక్కనబెట్టి సొంత ఆదాయాన్ని పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లతో ఆ శాఖ అధికారులు భారీగా వెనకేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం వ్యాపారులపై ఎలాంటి కేసులు నమోదు కాకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆ శాఖ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. దీంతో ఏం జరుగుతుందోనని ఉన్నతాధికారులు ఆరాతీసే పనిలో పడ్డారని తెలిసింది. అవినీతి పెరగడంతో పాటు మద్యం విక్రయాలలో రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచి ఆదాయం పడిపోవడంపై కమిషనర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.


