ఒంగోలు టౌన్: మార్కెట్లో పొగాకు కొనే దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారని, కానీ, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఈ నెల 25వ తేదీ పొగాకు వేలం కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టాలని నిర్ణయించామని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంతిబాబు తెలిపారు. ఒంగోలు నగరంలోని ఎల్బీజీ భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు అధ్యక్షత వహించగా, జయంతిబాబు మాట్లాడుతూ గత సంవత్సరం కేజీ రూ.280తో ప్రారంభమైన పొగాకు వేలం.. ఈ ఏడాది కేవలం రూ.250తో మొదలైందని తెలిపారు. మొదట్లో 30 శాతంగా ఉన్న నో బిడ్ ప్రస్తుతం 70 శాతానికి పెరిగిందని చెప్పారు. పొగాకును కొనుగోలు చేయకుండా చెక్కులు తిరిగి ఇంటికి పంపిస్తున్నారని, ఈ నేపథ్యంలో పొగాకు అమ్ముకోవడం రైతులకు కనాకష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఒక్క బ్యారన్‌కు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న పొగాకు రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. కంపెనీల ప్రయాజనాల కోసం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అందుకు నిరసనగా ఈ నెల 25వ తేదీ వేలం కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా జూన్ 1వ తేదీ పొగాకు బోర్డు వద్దకు రాయబారం వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్‌కే మాబు, ఏడుకొండలు, కనపర్తి సుబ్బారావు, రామారావు, గాలి వెంకటేశ్వర్లు, వేజండ్ల సింగయ్య పాల్గొన్నారు.


