సెగలు.. పొగలు! | - | Sakshi
Sakshi News home page

సెగలు.. పొగలు!

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

జిల్లాలో అత్యధికంగా 46.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదు తొమ్మిది మండలాల్లో ఇదే ఉష్ణోగ్రతలు పశ్చిమ ప్రకాశంలో 46 డిగ్రీలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం బెంబేలు ఈనెల 24 వరకూ అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్‌

నిర్మానుష్యంగా ఉన్న ఒంగోలు చర్చి సెంటర్‌

ఒంగోలు సబర్బన్‌: భానుడి భగభగలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. బుధవారం పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కనిగిరిలో 46.1, కొండపి 45.6, ఒంగోలు 44.5 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. మంగళవారంతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి మూడు డిగ్రీలు అదనంగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే వేడిగాలుల తీవ్రత కనిపించింది. ఉమయం 11 గంటలు నగరంలోని ప్రధాన వీధులు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాయంత్రం ఆరు గంటల తరువాతే రోడ్ల వెంట జనాలు సంచరించటం కనపడింది. ఇంట్లో ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంత మండలాల్లో సైతం విపరీతమైన ఉష్ణోగ్రతలు చోటు చేసుకున్నాయి. తీర ప్రాంత మండలాలతో పాటు ఒంగోలు, కొండపి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు సంతనూతలపాడు, అద్దంకి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో జిల్లాలోని ప్రజానీకం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోయారు. ఒక వేళ అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చినా వడదెబ్బకు తల్లడిల్లిపోయారు.

24వ తేదీ వరకూ జాగ్రత్త: కలెక్టర్‌

జిల్లాలో ఈనెల 24 వతేదీ వరకు తీవ్రమైన వేడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండవచ్చన్న వాతావరణ హెచ్చరికల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పీ రాజాబాబు సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తక్షణ సన్నద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లు, అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వేడి వాతావరణంలో అనారోగ్యం, మరణాల నివారణ, ప్రజల రక్షణ, అత్యవసర సేవల కొనసాగింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బస్‌ స్టాండ్‌లు, మార్కెట్లు, ప్రధాన కూడళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తాగునీటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నీటి కొరత ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం కోసం మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా పరిపాలన, వైద్యారోగ్య, పోలీస్‌, రెవెన్యూ, విద్య, అగ్నిమాపక సేవలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

వడదెబ్బకు ఇద్దరు మృతి

గుడ్లూరు: వడదెబ్బకు గురై గుడ్లూరు మండలంలో బుధవారం ఇద్దరు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఉపాధి కూలీ గంగోలు ఆదిశేషు (58) ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. కంచె తొలగించే పనిచేస్తూ అలసిపోయాడు. పని పూర్తిచేసుకుని మస్టర వేయించుకుని ఐరిస్‌ ఫొటో తీయించుకుని ఉదయం 9 గంటల సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు కూర్చునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు పడిపోయాడు. నోటి నుంచి గురక రావడంతో తోటి కూలీలు వెంటనే 108 వాహనంలో కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఏపీఓ వెంకటేశ్వర్లు మృతుని ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చులకు గ్రామస్తులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు.

అధికారుల నిర్లక్ష్యం:

వేసవి కాలం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. 8 గంటలకే ఎండ తీవ్రత వలన ఉక్కపోత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటలకు పనిముగించాలి. కానీ 9 గంటల వరకు కూలీల చేత పని చేయిస్తున్నారు. తాగేందుకు మంచినీరు కూడా అందుబాటులో ఉంచడం లేదు. దీంతో ఉపాధి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు.

వడదెబ్బకు వృద్ధుడు మృతి

అదేవిధంగా మండలంలోని రావూరు గ్రామానికి చెందిన గొల్లప్రోలు సుబ్బారావు (65) వడదెబ్బకు గురై బుధవారం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement