ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకుడు కృష్ణారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఒంగోలు టౌన్: ఆన్‌లైన్ ఔషధాలపై నియంత్రణ విధించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు దగ్గుమాటి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బంద్ నిర్వహించిన మెడికల్ షాపు నిర్వాహకులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్ విక్రయాల వలన ఔషధాల దుర్వినియోగం జరుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. అదుపులేకుండా యాంటీ బయాటిక్స్, సైకోట్రోపిక్, ఓపియాయిడ్ మందులు వాడి ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారని చెప్పారు. ఒకే ప్రస్కిప్షన్ ను పదే పదే వినియోగించి నియంత్రిత ఔషధాలను కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల డ్రగ్ రెసిస్టెంట్ అవడంతో వ్యాధులు త్వరితంగా తగ్గడం లేదన్నారు. ఔషధాలను వాణిజ్య వస్తువులుగా పరిగణించడం సరైన నిర్ణయం కాదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ ఆన్‌లైన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. మందుల ధరలు రోజురోజుకూ పెరిగిపోయి సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయని, దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక ఔషధాల ధరలు చాలా మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీపీ, షుగర్, క్యాన్సర్ మందుల ధరలు తగ్గించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన మందులు చవకగా అందించాలన్నారు. ఫార్మసీ వృత్తిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పావులూరి శ్రీధర్, సతీష్, వెంకారెడ్డి, కూరపాటి వెంకట సత్యనారాయణ, ఏడుకొండలు, నరసింహారావు, మాలంపాటి రమణరావు, కోటిరెడ్డి, రవికుమార్, వేమూరి సుబ్బారావు, శ్రీనివాసులు రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.


