రోడ్డు ప్రమాదంలో జింక మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో జింక మృతి

May 21 2026 12:32 AM | Updated on May 21 2026 12:32 AM

రోడ్డు ప్రమాదంలో జింక మృతి జామాయిల్‌ తోట దగ్ధం ధ్యానంతో ఒత్తిడి దూరం గ్యాస్‌ ఏజెన్సీపై 6ఏ కేసు నమోదు

పొదిలి రూరల్‌: పొలాల్లో నుంచి పరుగుతీస్తూ రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పొదిలి పట్టణంలోని బాప్టిస్టుపాలెం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జింక మృతి చెందడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు గుట్టుగా మాంసాహారం కింద తీసుకెళ్లడం గమనార్హం. వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా చనిపోయిన జింక కలేబరానికి అటవీ శాఖ అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి, ఖననం చేయాల్సి ఉండగా అదేమీ పట్టించుకోలేదు. అటవీశాఖ అధికారుల తీరుపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టంగుటూరు: పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో మూడు ఎకరాల్లో జామాయిల్‌ తోట దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని జమ్ములపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో సేకరించిన చెత్తను శివారులో ఉన్న చెత్త సేకరణ సంపద కేంద్రం వద్ద వేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం పంచాయతీ సిబ్బంది చెత్తకు నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న కొత్తపల్లి వెంకటేశ్వర్లు, అన్నాబత్తిన పూర్ణచంద్రరావులకు చెందిన పొలంలో జామాయిల్‌ తోటలకు మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో సమీపంలోని పశువుల కాపరులు రైతులకు సమాచారం అందించారు. రైతులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.

ఒంగోలు సిటీ: ధ్యానంతో ఒత్తిడి దూరమై ఏకాగ్రత పెరుగుతుందని ఏఆర్‌ డీఎస్పీ కె.శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబ్బందికి ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. శ్రీరామచంద్ర మిషన్‌న్‌కు చెందిన భాస్కర్‌రెడ్డి, ఏ. విజయలక్ష్మి మాట్లాడుతూ నిత్యం ధ్యానం చేయడం ద్వారా మానసిక, శారీరక ప్రశాంతత నెలకొంటుందన్నారు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ధ్యానం పెంపొందిస్తుందని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకర జీవనశైలి ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. ఆర్‌ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, ఆర్‌ఎస్సైలు ప్రసాద్‌, మాల్యాద్రి, తిరుపతి స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

పుల్లలచెరువు: మండల కేంద్రమైన పుల్లలచెరువులోని శ్రీనివాస భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీపై 6ఏ కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి డి.అంకయ్య బుధవారం తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వినియోగదారుల ఫిర్యాదు మేరకు గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీనివాస భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీలో సిలిండర్‌పై అధికంగా వసూలు చేస్తున్నారని, బ్లాక్‌ మార్కెట్‌లో సిలిండర్లు విక్రయిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయని తెలిపారు. కలెక్టర్‌, జేసీ ఆదేశాల మేరకు కంపెనీ ప్రతినిధి సక్షమంలో ఏజెన్సీ కార్యాలయాన్ని తనికీ చేయగా 177 సిలిండర్లకుగాను 33 మాత్రమే ఉన్నాయని, 144 సిలిండర్లు అక్రమంగా విక్రయించినట్లు తేలిందని వివరించారు. వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు భారత్‌ గ్యాస్‌ కంపెనీ ప్రతినిధికి ఏజెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. గ్యాస్‌ ఏజెన్సీ పాయింట్‌ నుంచి 15 కి.మీ పరిధిలో గల గ్రామాల్లో వినియోగదారులకు డోర్‌ డెలివరీ ఉచితంగా చేయాలని డీఎస్‌ఓ స్పష్టం చేశారు. తనిఖీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ చంద్రశేఖర్‌, వీఆర్వో కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement