● నిద్రిస్తున్న మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరణ
మార్కాపురం రూరల్: గాఢ నిద్రలో ఉన్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ సంఘటన బుధవారం వేకువజామున మార్కాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన వెంకటలక్ష్మమ్మ(37) ఇంటి ముందు వరండాలో నిద్రిస్తుండగా ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు సరుడును గుర్తు తెలియని వ్యక్తి లాక్కుని పరారయ్యాడు. అలాగే 70 ఏళ్ల వృద్ధురాలు దేవవరపు కోటమ్మ ఇంటి ముందు వేపచెట్టు కింద నిద్రిస్తుండగా ఆమె మెడలోని సుమారు 25 గ్రాముల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. రెండు ఘటనల్లో అప్రమత్తమైన బాధితులు కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి దొంగల ఆచూకీ కోసం గాలించారు. వరుస చోరీలతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న మార్కాపురం సీఐ ఎండీ హుస్సేన్, పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి గ్రామానికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.


