పొదిలి రూరల్: పొదిలి మండల పరిధిలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. కమీషన్ రూపంలో నొక్కేసిన సొమ్మును పంచుకునే విషయంలో తేడాలు రావడంతో ఇటీవల సిబ్బంది, ఎఫ్‌ఏలు గొడవపడ్డారు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో బుధవారం పొదిలిలోని ఉపాధి హామీ కార్యాలయంలో జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. కూలీల వద్ద ఎంత డబ్బు వసూలు చేశారు?, ఎవరెవరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు?, కార్యాలయ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ల మధ్య గొడవకు ముఖ్య కారణాలు ఏమిటనే విషయాలపై ఆరా తీశారు. విచారణ అనంతరం జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి విలేకర్లతో మాట్లాడుతూ.. గ్రామాల్లో పనులు కొలతల ప్రకారం సక్రమంగా చేశారా లేదా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో విచారించనున్నట్లు చెప్పారు. అధికారులు డబ్బు వసూలు చేస్తున్నట్లు కూలీలు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.


