మాడుపగులుతోంది..! | - | Sakshi
Sakshi News home page

మాడుపగులుతోంది..!

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

మంగళవారం ఉమ్మడి జిల్లా అంతటా 42 డిగ్రీలు రానున్న మూడు రోజులు అగ్నిగుండమే జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం బల్లికురవ మండలం మల్లాయపాలెంలో ఎండదెబ్బకు ఉపాధి కూలీ మృతి అల్లాడిపోతున్న రోజువారీ కూలీలు జిల్లాలో ఎక్కడా కనిపించని చలివేంద్రాలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. 11 గంటల నుంచే భానుడి భగభగలు పెరుగుతున్నాయి. రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. అత్యవసరమైతేనే జనం బయటకు రావాలని సూచించింది. వేసవి సెగలకు బల్లికురవ మండలంలో ఒక ఉపాధి కూలీ మృతి చెందాడు.

ఒంగోలు టౌన్‌: రోహిణి కార్తెకు ముందే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా కేంద్రాలైన ఒంగోలు, మార్కాపురంలలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. అలాగే కనిగిరి, అద్దంకి, దర్శి, కంభం, బేస్తవారిపేట, చీమకుర్తిల్లో కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యర్రగొండపాలెం, సింగరాయకొండ 41 డిగ్రీలు, నల్లమల అటవీ ప్రాంతంలోని దోర్నాలలో 40 డిగ్రీలు నమోదైంది. అయితే నమోదైన ఉష్ణోగ్రతల కంటే వేడి అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల వేడి తీవ్రత ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా వాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

రానున్న మూడు రోజులు అగ్నిగుండమే...

రానున్న మూడు రోజులు రికార్డు స్థాయిలో ఎండలు ఉంటాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో, మార్కాపురం జిల్లాలో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 20, 21 తేదీల్లో బుధ, గురువారం రెండు రోజులు ప్రకాశం జిల్లాలోని కొన్ని మండలాలు, మార్కాపురంలో 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించింది.

కనిపించని చలివేంద్రాలు:

గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా జిల్లాలో ఎక్కడా చలి వేంద్రాలు కనిపించడం లేదు. జిల్లా కేంద్రమైన ఒంగోలు, మార్కాపురంలో కూడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మండల కేంద్రాలు, పంచాయతీల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఎక్కడో ఒకటీ అరా కనిపిస్తున్నాయి. విద్య, వైద్యం కోసం ప్రతినిత్యం గ్రామీణ ప్రజలు జిల్లా కేంద్రాలకు వస్తుంటారు. ఎండ వేడికి గొంతు ఎండిపోయి దాహం వేస్తే గుక్కెడు మంచినీళ్లు దొరకడం గగనమైపోయింది. చలివేంద్రాలు లేకపోవడంతో లీటర్‌ నీళ్లు 5 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం చలివేంద్రాలను కూడా పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement