ఆక్రమించేస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆక్రమించేస్తాం

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

ఆక్రమించేస్తాం

వల్లకాడా..వాగు పోరంబోకా..

శ్మశాన స్థలమా..వాగు పోరంబోకు భూమా..ఏదైనా సరే ఆక్రమించేస్తారు...

అడిగేదెవరు..అడ్డుకునేదెవరు అన్నట్లు గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అధికారం అండగా గ్రామాల్లో కబ్జా పర్వం సాగిస్తున్నారు. ఎవరైనా

ప్రశ్నిస్తే..దూషణలకు, దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

మర్రిపూడి మండలంలో చిలంకూరులో

ఓ టీడీపీ నేత ఏకంగా శ్మశానానికి వెళ్లే దారినే కబ్జా చేశాడు. అంతటితో

ఆగకుండా ఒకటిన్నర ఎకరాల చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించి శాశ్వత

కట్టడాలు కట్టేశాడు. అధికారులకు

తెలిసినా ఎటువంటి చర్యలు

తీసుకోకుండా మౌనం వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మర్రిపూడి:

మండలంలోని చిలంకూరు గ్రామంలో టీడీపీ నేతల అక్రమాలు, అరాచకాలకు పెచ్చుమీరాయి. ఖాళీ స్థలాలే కాకుండా ఏకంగా శ్మశాన దారి, చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించేశారు. చెరువు పోరంబోకు భూమిలో ఏకంగా శాశ్వత కట్టడాలు కట్టారంటే అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మండలస్థాయి అధికారులకు ఈ ఆక్రమణల పర్వం గురించి తెలిసినా పట్టించుకోకపోవడంతో బాధితులు కలెక్టర్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. పచ్చనేతలు ఆక్రమించిన చెరువుకు నీరు చేరితే ఆక్రమంగా నిర్మించిన కట్టడాలతో దళితుల నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్రమించినా..అడిగేదెవరు..?

మండలంలోని చిలంకూరు గ్రామాన్ని ఆనుకొని సర్వే నం.70లో సుమారు 20 ఎకరాల్లో మొండి చెరువు, వాగు పోరంబోకు భూమి విస్తరించి ఉంది. ఈ భూమిపై ఆదే గ్రామానికి చెందిన కూటమి నాయకుడు కొప్పోకు రమేష్‌ కన్ను పడింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనుకున్నదే తడువుగా ఆక్రమణకు పూనుకున్నారు. వాగు పోరంబోకు, మొండి చెరువును యథేచ్ఛగా ఆక్రమించి విశాలమైన షెడ్‌ను శాశ్వతంగా నిర్మించాడు. అంతటితో ఆగకుండా ఎలాంటి అనుమతులు లేకుండా దళితవాడకు సమీపంలో ఉన్న మొండి చెరువును అక్రమంగా తవ్వేసి, చెరువుమట్టిని సుమారు ఒకటిన్నర ఎకరాల విస్థీర్ణంలో చదును చేశాడు. ఇదేమని ప్రశ్నించిన దళితులను మీకు దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తూ దౌర్జన్యానికి దిగాడు.

అనుమతి లేకుండా చెరువుమట్టి తరలింపు

సదరు టీడీపీ ఆక్రమణలతో ఆగలేదు. చెరువులోని మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వేశాడు. దాదాపు ఎకరన్నర భూమిని ఆక్రమించి అందులో కూడా చెరువు మట్టినే తోలుకున్నాడు. ఇంత బహిరంగంగా చెరువు మట్టిని ఆక్రమంగా తవ్వేస్తున్నా అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో అధికారులనే ఆక్రమణలకు, అక్రమ తవ్వకాలు సహకరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణ

చిలంకూరు గ్రామంలో దళితులకు చెందిన శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని గ్రామానికి చెందిన కొప్పోకు రమేష్‌ ఆక్రమించాడని అదే గ్రామానికి చెందిన దళితులు కలెక్టర్‌కు పలు మార్లు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఎవరైన చనిపోతే శవాలను ఖననం చేసేందుకు తీసుకెళ్లే రహదారిని ఆక్రమించడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశానానికి వెళ్లే రహదారిని ఆక్రమించడమే కాకుండా శాశ్వత కట్టడాలు కట్టాడని, దాదాపు రెండు ఎకరాల బారులో మట్టితోలి చదునుచేశాడన్నారు. ఇదేమని ప్రశ్నించిన మా ఎస్సీలపై దౌర్జన్యం చేస్తున్నాడని వారు వాపోయారు. వర్షాకాలంలో చెరువుకు నీరు చేరితే నాయకుల ఆక్రమణలో నిర్మించిన కట్టడాలతో దళితుల నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్‌ జనార్దన్‌ను సంప్రదించినా మహిళలని కూడా చూడకుండా దురుసుగా సమాధానం చెబుతున్నారని మహిళలు వాపోయారు.

దళిత మహిళల నిరసన

మండలంలోని చిలంకూరు గ్రామానికి సమీపంలో ఉన్న చెరువును గ్రామానికి చెందిన ఓ నాయకుడు యథేచ్ఛగా ఆక్రమించి శాశ్వత కట్టడాలు కట్టి శ్మశానానికి వెళ్లే దారిలేకుండా చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారులుకు దృష్టికి తీసుకెళ్లినా..ఎలాంటి స్పందన లేకపోవడంతో దళిత మహిళలు నిరసనకు దిగారు. దళితవాడ నుంచి శ్మశానానికి ఎలా వెళ్లాలని వారు ప్రశ్నిస్తున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.

స్పందించని రెవెన్యూ అధికారులు

శ్మశాన స్థలం, చెరువు వాగుపోరంబోకు భూమి ఆక్రమణపై దళిత మహిళలు పలుమార్లు తహసీల్దార్‌ జనార్దన్‌ను కలిసి విన్నవించారు. అయితే ఆయన నుంచి సరైన స్పందన లేకపోగా దురుసుగా వ్యవహరించారని మహిళలు వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఆక్రమణలు తొలగించలేదంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి దళితులను న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఆక్రమణలపై తహసీల్దార్‌ జనార్దన్‌ను వివరణ కోరగా..చిలంకూరు చెరువులో గత కొన్ని నెలలుగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై పరిశీలించి నోటీసులు ఇచ్చి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు.

దళితుల శ్మశాన దారిని ఆక్రమించిన టీడీపీ నాయకుడు

ఒకటిన్నర ఎకరాల చెరువుపోరంబోకు భూమి యథేచ్ఛగా ఆక్రమణ

చెరువులో శాశ్వత కట్టడాలు నిర్మించిన వైనం

ప్రశ్నించే వారిపై దౌర్జన్యం

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన దళితులు

కూటమి పాలనలో పెచ్చుమీరిన ఆక్రమణలు

Advertisement
 
Advertisement
Advertisement