భూ వివాదంతోనే హత్య | - | Sakshi
Sakshi News home page

భూ వివాదంతోనే హత్య

May 20 2026 10:43 AM | Updated on May 20 2026 10:43 AM

పామూరు: సీఎస్‌పురం మండలం పెద్దగోగులపల్లెలో ఈ నెల 15న జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ దుర్గాసి వినోద్‌కుమార్‌ తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సీఎస్‌పురం మండలంలోని పెద్ద గోగులపల్లి గ్రామానికి చెందిన మిరియం బాబుచౌదరి, చిలంకూరి రమేష్‌రెడ్డిలకు గ్రామ సమీపంలోని 4 ఎకరాల పొలానికి సంబంధించి వివాదం ఉంది. దీంతో ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈనెల 15వ తేదీ శుక్రవారం సదరు పొలంలో చిలంకూరి రమేష్‌రెడ్డి షెడ్‌ నిర్మాణానికి సంబంధించి పునాది పనులు చేస్తుండగా విషయం తెలుసుకున్న మిరియం వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు మిరియంబాబు చౌదరి, మరికొందరు అక్కడికి వెళ్లి ట్రాక్టర్‌తో నిర్మాణ పనులను తొలగించడంతో వివాదం ప్రారంభమైంది. ఈ విషయాన్ని రమేష్‌రెడ్డి ఇంటికి వెళ్లిన తరువాత భార్య, తల్లికి చెప్పాడు. పొల వివాదం సర్దుమణగాలన్నా, తమకు పొలం దక్కాలన్నా మిరియం వెంకటేశ్వర్లు లేదా ఆయన కుమారుడు మిరియం బాబుచౌదరిలో ఒకరిని అడ్డు తొలగించాలని చెప్పాడు. అదే రోజు మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో మిరియం వెంకటేశ్వర్లు మోటార్‌బైక్‌పై రమేష్‌రెడ్డి ఇంటి ముందునుండి వెళ్తుండగా చిలంకూరి రమేష్‌రెడ్డి, అతని భార్య ధనలక్ష్మి, తల్లి రామాంజమ్మలు అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. గొడవలో చిలంకూరి రమేష్‌రెడ్డి మడ్డుకత్తితో మిరియం వెంకటేశ్వుర్లుపై దాడికి యత్నించగా వెంకటేశ్వర్లు అప్రమత్తమై తప్పించుకోగా మోస్తరు గాయమైంది. స్థానిక మహిళలు అక్కడకు చేరుకొవడంతో నిందితుడు చిలంకూరి రమేష్‌రెడ్డి అక్కడ నుంచి పరారై రోడ్డు వైపుకు వెళ్లాడు. ఇంతలో విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కుమారుడు మిరియం బాబుచౌదరి బైక్‌పై ఊళ్లోకి వస్తుండగా గమనించిన చిలంకూరి రమేష్‌రెడ్డి అదే కత్తితో మిరియం బాబుచౌదరిని పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మిరియం బాబుచౌదరిని కారులో పామూరు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడు రమేష్‌రెడ్డి సంఘటనా స్థలం నుంచి పరారై సమీపంలోని కొట్టాలుపల్లె గ్రామానికి వెళ్లాడు. గ్రామంలో రమేష్‌రెడ్డికి బంధువు అయిన నల్లపు రామాంజిరెడ్డి రక్తపు దుస్తులు, ఇతర ఆధారాలను కాల్చేవేయించి నిందితున్ని మరో చోట దాచి ఉంచాడు. మృతుని తండ్రి మిరియం వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న చిలంకూరి రమేష్‌రెడ్డి మంగళవారం మండలంలోని పెదరాజుపాలెం వీఆర్‌ఓ బి.మాల్యాద్రి వద్ద లొంగిపోయాడు. వీఆర్‌ఓ ఇచ్చిన సమాచారం మేరకు పెద్దగోగులపల్లి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోని బ్రిడ్జి వద్ద నిందితున్ని చిలంకూరి రమేష్‌రెడ్డిని అరెస్ట్‌చేసి అక్కడి నుంచి కొటాలుపల్లి వెళ్లి ఆధారాలు చెరిపివేసి దాగి ఉండేందుకు సహకరించిన నల్లపు రామాంజిరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు సీఐ దుర్గాసి వినోద్‌కుమార్‌ తెలిపారు. తొలుత మొదట మిరియం వెంకటేశ్వర్లుతో గొడవపడి స్వల్ప గాయానికి కారణమైన రమేష్‌రెడ్డి భార్య ధనలక్ష్మి, తల్లి రామాంజమ్మలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరికై నా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు, ఆధారాలు ఉంటే వారిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. సీఐ వెంట ఎస్సై యం.వెంకటేశ్వరనాయక్‌, సిబ్బంది ఉన్నారు.

హత్య కేసులో ఇద్దరి అరెస్టు

మరో ఇద్దరిపై కేసు నమోదు

హత్య కేసు వివరాలను వెల్లడించిన సీఐ

Advertisement
 
Advertisement
Advertisement