దొంగాట..కాసుల వేట | - | Sakshi
Sakshi News home page

దొంగాట..కాసుల వేట

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

మొక్కుబడిగా వేసవి శిక్షణ శిబిరాలు శాప్‌ నిధులు మింగేస్తున్న అధికారులు శిబిరాలకు చేరని క్రీడాపరికరాలు పౌష్టికాహారంలోనూ చేతివాటం నీళ్ల కోసం కూడా అల్లాడుతున్న క్రీడాకారులు షటిల్‌ బ్యాడ్మింటన్‌ శిక్షణకు నగదు వసూళ్లు

శిక్షణకు డబ్బులు వసూలు..

ఒంగోలు సిటీ:

డాదంతా పుస్తకాలతో కుస్తీపడిన విద్యార్థులకు వేసవిలో ఉత్సాహం..ఉల్లాసం.. ఆరోగ్యం అందించేందుకు ఏటా శాప్‌ ఆధ్యర్యంలో ప్రత్యేక క్రీడా శిబిరాలు జరుగుతుంటాయి. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ విద్యార్థులకు సుమారు 25 కిపైగా క్రీడాంశాల్లో 55 శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శాప్‌ జిల్లాకు రూ.6.54 లక్షలు కేటాయించింది. వీటి ద్వారా ఆయా క్రీడల కోసం అవసరమైన పరికరాల కొనుగోలుతోపాటు ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాల్సి ఉంది. శిక్షణ శిబిరాలు ప్రారంభమై పక్షం రోజులు దాటుతున్నా మొక్కుబడిగా శిబిరాలు సాగుతున్నాయి. శాప్‌ ఇచ్చిన నిధులను ఖర్చు చేయకపోగా క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఒంగోలులోని మినీ స్టేడియంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సంక్రాంతి సంబరాలు..క్రీడలతో సంప్రదాయ వేడుకలు అంటూ ఫ్లెక్సీ వేశారు. అయితే పోటీలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా పక్కనే అధికార పార్టీ నేత ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారితో నాలుగు ఆటలు ఆడించి మమ అనిపించారు.

ప్రత్యేక శిబిరాలు ఇలా..

జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఒంగోలులో ఫుట్‌బాల్‌, సెపక్‌తక్రా, బాక్సింగ్‌, ఖోఖో, కరాటే, రైఫిల్‌ షూటింగ్‌, స్కేటింగ్‌, స్విమ్మింగ్‌, తైక్వాండో, పవర్‌ లిఫ్టింగ్‌లతోపాటు, ఆర్చరీ, అథ్లెటిక్‌, ఫెన్సింగ్‌, చెస్‌, కబడ్డీ, బ్యాడ్మింటన్‌, జూడో క్రీడల్లో శిక్షణ శిక్షణ ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జరుగుమల్లిలో పవర్‌ లిఫ్టింగ్‌, కారుమూడివారిపాలెంలో హ్యాండ్‌బాల్‌, పామూరులో బాల్‌బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌ శిక్షణ ఏర్పాటు చేశారు. ఆలకూరుపాడులో వాలీబాల్‌, అల్లూరు వాలీబాల్‌, కరేడులో హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, సింగరాయకొండలో హ్యాండ్‌బాల్‌, ఎస్‌ఎన్‌పాడులో హాకీ, బ్యాడ్మింటన్‌, బిట్రగుంటలో వెయిట్‌లిఫ్టింగ్‌, పవర్‌ లిఫ్టింగ్‌, వైపాలెంలో అథ్లెటిక్స్‌, ఖోఖో, బ్యాడ్మింటన్‌, కనిగిరిలో బ్యాడ్మింటన్‌, ఖోఖో, మార్కాపురంలో బాక్సింగ్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, గిద్దలూరులో టెన్నిస్‌, పంగులూరులో ఖోఖో, కబడ్డీ క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. శాప్‌ ఇచ్చిన నిధుల నుంచి పరికరాలకు రూ.2,32,440, మైదానాలు సిద్ధం చేసేందుకు రూ.1,65,000 ఖర్చు చేయాల్సి ఉంది. అయితే క్రీడా పరికరాలు కొనుగోలు చేయలేదు. శిక్షణకు సంబంధించి పై నుంచి వచ్చిన పరికరాలను ఇంత వరకు క్యాంపులకు పంపిణీ చేయలేదు. మైదానం లోపల కనీస వసతుల్లేకుండా మొక్కుబడిగా సిద్ధం చేశారు. శిబిరాలకు వచ్చే విద్యార్థులు తాగునీటి కోసం కూడా అల్లాడుతున్నారు.

పౌష్టికాహారంలోనూ చేతివాటం..

క్రీడల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు పౌష్టికాహారాన్ని కూడా అందించాలి. ఇందుకోసం రూ.2,57,400 ఖర్చు చేయాలి. పాలు, గుడ్డు, ఇతర బలమైన ఆహారాన్ని ఒక్కో రోజు ఒక్కోటి చొప్పున అందించాల్సి ఉంది. అయితే వీటిల్లోనూ అధికారులు చేతివాటం చూపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విద్యార్థికి రూ.6 ఇవ్వాల్సి ఉండగా ఏఒక్క విద్యార్థికీ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు.

వేసవి శిక్షణ శిబిరాల్లో పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. అయితే షటిల్‌ బ్యాడ్మింటన్‌ శిక్షణ కోసం అనధికారికంగా ఒక్కొక్కరి వద్ద రూ.1000 చొప్పున 30 మంది వద్ద రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. కోచ్‌లనే ఆ డబ్బులు వసూలు చేయమని అధికారే చెప్పడం గమనార్హం. షటిల్‌ కాక్‌లకు కూడా డబ్బులు వసూలు చేశారు. ఉచితంగా ఇవ్వాల్సిన శిక్షణకు డబ్బులు వసూలు చేయమన్న విషయంలో విభేదాలతో కోచ్‌ విరమించుకోవడంతో ఒంగోలు నగరంలో షటిల్‌ బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరం నిలిచిపోయింది. ఇలా వేసవి శిక్షణ శిబిరాలు క్రీడాకారులకు ఉపయోగపడకపోగా సంబంధిత అధికారులకు ఆదాయవనరుగా మారాయి.

Advertisement
 
Advertisement
Advertisement