గిద్దలూరు రూరల్: మండలంలోని సంజీవరాయుడుపేట గ్రామానికి చెందిన బి.శ్రీకాంత్ అనే యువకుడు నంద్యాలరోడ్డులోని సగిలేరు బ్రిడ్జి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ అనే యువకుడు వృత్తి రీత్యా డ్రైవర్‌గా జీవనం కొనసాగి స్తుంటాడు. తల్లిదండ్రులు లేని కారణంగా కుటుంబ సభ్యుల ఆదరణ కోల్పోయి మద్యానికి బానిసై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రైలుపట్టాలపై పడుకున్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వైపు వెళ్లే గూడ్స్ రైలు డ్రైవర్ పట్టాలపై పడుకుని ఉన్న శ్రీకాంత్‌ను గుర్తించి రైలును నిలుపుదల చేసి సమాచారాన్ని గిద్దలూరు రైల్వేస్టేషన్‌కు అందజేశారు. సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ పిచ్చిరెడ్డి తన సిబ్బంది సంఘటనా స్థలానికి వద్దకు చేరుకొని రైలు పట్టాలపై ఉన్న శ్రీకాంత్‌ను అదుపులోనికి తీసుకొని ఆత్మహత్యకు కారణాలను తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.


