హమ్మయ్యా.. బతికిపోయాం! | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్యా.. బతికిపోయాం!

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు

మంటలు వ్యాపించిన ప్రాంతంలో కాలిపోయిన పెయింట్‌ డబ్బాలు

ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు వెళ్తున్న ప్రయాణికులు

ఉలవపాడు:

మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ట్రావెల్స్‌ బస్సు దగ్ధమై 14 మంది సజీవ దహనం కాగా, మరో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన సంఘటన మరువక ముందే అదే తరహా ఘటన ఉలవపాడు మండలంలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా ట్రావెల్స్‌ బస్సు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఉలవపాడు మండల పరిధిలోని రాజుపాలెం–చాగల్లు మధ్య జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన బస్సును ఓవర్‌ టేక్‌ చేస్తున్న మరో వాహనం డ్రైవర్‌ జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. కావేరి ట్రావెల్స్‌ బస్సు పంక్చర్‌ కాగా అలాగే దూసుకెళ్తుండటంతో ఒత్తిడి అధికమై తొలుత పొగలు, కాసేపటికే మంటలు వ్యాపించాయి. ప్రయాణికులంతా హుటాహుటిన దిగి తమ లగేజీని తీసేసుకోవడంతో ఆస్తి నష్టం కూడా తప్పింది.

ఫైర్‌ ఎక్స్టింగ్విషర్లు లేవు

బస్సు కళ్ల ముందే దగ్ధమవడాన్ని చూసిన ప్రయాణికులు భీతిల్లారు. దారిన వెళ్తున్న వ్యక్తి అప్రమత్తం చేయకుంటే తమ పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోందని ప్రయాణికులు అభిప్రాయపడ్డారు. బస్సులో మంటలు ఆర్పేందుకు ఫైర్‌ ఎక్స్టింగ్విషర్లు లేవని, అత్యవసర ద్వారం తెరిచే టూల్‌ కిట్‌ కూడా కనిపించలేదని, అందరం ముందు ద్వారం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. బస్సులో ఉన్న కొంత నీటిని టైర్‌ వద్ద మంటలపై పోసినా చల్లారకపోవడంతో ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసినప్పటికీ ప్రయాణికులకు సమాధానం కరువైంది. మంటలు చెలరేగిన బస్సు టైరు పక్కనే ఉండే లగేజీ క్యాబిన్‌లో పెయింట్‌ డబ్బాలు ఉన్నాయని, వీటి మూలంగానే వేగంగా మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోయి ఉంటుందని ప్రత్యక్ష సాక్షులైన ప్రయాణికులు తెలిపారు.

ప్రయాణికుల క్షేమం గాలికి..

ప్రమాద సమయంలో బస్సు నుంచి దిగిన ప్రయాణికులను ఎవరూ పట్టించుకోలేదు. కావేరీ ట్రావెల్స్‌ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోగా, అదే సంస్థకు చెందిన బస్సులు హైవేలో వెళ్తున్నా ఒక్కటీ ఆపలేదు. ప్రయాణికులు చేతులెత్తి అర్థిస్తున్నా స్పందన లేకపోవడంతో శాపనార్థాలు పెడుతూ ప్రైవేట్‌ కార్లు, ఇతర వాహనాల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లారు.

అధికారుల పరిశీలన

ఘటనా స్థలాన్ని కందుకూరు ఆర్టీఓ నాగలక్ష్మి, కందుకూరు సీఐ అన్వర్‌ బాషా, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు పరిశీలించారు. బస్సు డ్రైవర్ల వద్ద ప్రమాద వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హైవే రోడ్‌ సేఫ్టీ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఉలవపాడు మండలంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు

36 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితం

బస్సులో కనీస వసతులు లేవు

బస్సు చాలా పాతగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వెళ్లడానికి అత్యవసర ద్వారం కూడా లేదు. మంటలు ఆర్పేందుకు మంచి నీళ్లు పోశారు. హైవేలో వెళ్తున్న మరో బస్సు నుంచి కార్బన్‌ డయాకై ్సడ్‌ సిలిండర్లు తీసుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు తప్ప ఈ బస్సులో మాత్రం సిలిండర్లు ఉంచలేదు. బస్సు పంక్చర్‌ అయి పెద్ద శబ్ధం వచ్చింది. కొంత సేపటి తర్వాత పొగలు వస్తుండటంతో వెనుక వస్తున్న వారు గమనించి అప్పమత్తం చేశారు. మొత్తం మీద పెద్ద గండం నుంచి బయటపడ్డాం. – వినోద్‌, హోటల్‌ వ్యాపారి, హైదరాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement