ఈనాం భూములకు పట్టాలివ్వండి | - | Sakshi
Sakshi News home page

ఈనాం భూములకు పట్టాలివ్వండి

May 16 2026 3:07 AM | Updated on May 16 2026 3:07 AM

సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని కొమ్మాలపాడు, సజ్జాపురం, మక్కెనవారిపాలెం తదితర గ్రామాల్లోని 4,800 ఎకరాల ఈనాం భూములకు పట్టాలు ఇప్పించాలని కలెక్టర్‌ రాజాబాబును కొమ్మాలపాడు గ్రామస్తులు కోరారు. మండలంలోని సజ్జాపురం గ్రామంలో కలెక్టర్‌ శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామంలో భూములకు సంబంఽధించి వచ్చిన అర్జీలను రీసర్వే సమయంలో సరిచేస్తామని, మండల సర్వేయర్‌ సాంబశివరావు, వీఆర్‌ఓ సామ్యేల్‌ అర్జీదారులకు చెప్పడంపై మండిపడ్డారు.

సమస్యలు ఏకరువు

మట్టికొండకు చుట్టూ ఉన్న భూమిని ఆక్రమించి అందులోకి జీవాలను తోలుకెళ్లనీయడం లేదని, మట్టి కోసం వెళ్తున్న వారిని అడ్డగిస్తున్నారని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. నూతన పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్‌ బైకు బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని విన్నవించారు. సబ్‌స్టేషన్‌ నుంచి బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి, మార్టూరు వెళ్లడానికి ఉన్న మట్టిరోడ్డును పొడిగించి మెటల్‌ రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏల్చూరు నుంచి సజ్జాపురం కూడలికి నెహ్రు నగర్‌ రోడ్డును కలపాలని కోరారు. కొప్పరం పంచాయతీ పరిధిలో రెండు గ్రానైట్‌ క్వారీల నుంచి వచ్చే కాలుష్యాన్ని తాము భరిస్తున్నామని, ఆదాయం మాత్రం కొప్పరం పంచాయతీ వెళ్తోందని, అలా కాకుండా తమ పంచాయతీకి ఆదాయం కేటాయించాలని కోరారు. పల్లె నిద్ర కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్‌రెడ్డి, అద్దంకి ఆర్డీఓ జాన్సన్‌, జిల్లా పరిషత్‌ సీఈఓ చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్‌ రవిబాబు, ఎంపీడీఓ జ్యోతిర్మయి తదితర అఽధికారులు పాల్గొన్నారు.

పల్లె నిద్రలో కలెక్టర్‌ రాజాబాబుకు కొమ్మాలపాడు రైతుల వినతి

గ్రానైట్‌ ఆదాయం రెవెన్యూ గ్రామానికి జమ చేయాలని వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement